బాహుబలి సినిమాను హిందీ ఆడియెన్స్‌కు అందించిన బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహర్కి, ఆ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్‌కి సైతం సుపరిచితుడైన ప్రభాస్‌కు మధ్య విభేదాలు నెలకొన్నట్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసింతే. బాహుబలి తర్వాత ఓ డైరెక్ట్ హిందీ సినిమాతో ప్రభాస్‌ను మరోసారి బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు కరణ్ ప్రయత్నించటం.. అందుకు ప్రభాస్ నో చెప్పటమే ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడానికి కారణమైందనేది ఆ వార్తల సారాంశం. ఇటీవల దుబాయ్‌లో సాహో సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఈ వివాదంపై స్పందించాడు.
కరణ్ జొహర్‌తో తనకు మధ్య దూరం పెరిగిందని వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రభాస్ స్పష్టంచేశాడు. అవన్నీ ఉత్తుత్తి రూమర్స్ మాత్రమేనని ప్రభాస్ కొట్టిపారేశాడు. తమ మధ్య విభేదాలు నెలకొన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం కరణ్ జొహర్ తనకు ఫోన్‌చేసి చెబితే గానీ తెలియదన్న ప్రభాస్... మా మధ్య ఎలాంటి వివాదం లేదని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా సైతం హిందీ ఆడియెన్స్ ముందుకు వెళ్లనుంది.
రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుజీత్ ఆ తర్వాత నాలుగేళ్లపాటు మరో సినిమాను డైరెక్ట్ చేయకుండా ప్రభాస్ కోసం వేచిచూసి, బాహుబలి తర్వాత ప్రభాస్ రిలాక్స్ అయ్యాకే సాహో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రభాస్ సరసన జంటగా నటిస్తోంది.
అతడితో తనకు ఏ విభేదాలు లేవన్న డార్లింగ్