Srilanka Next President: శ్రీలంకలో పాలకులు మారే సమయం ఆసన్నమైంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఇప్పటికే దేశం విడిచి పారిపోయిన రాజపక్స ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు. రాజపక్స రాజీనామాతో లంక ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. అదే సమయంలో లంక తదుపరి అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష పదవి రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ప్రస్తుత ఆపద్ధర్మ అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస, ఎంపీ డల్లాస్ అలహప్పెరుమ ఉన్నారు.
రణిల్ విక్రమసింఘే :
రణిల్ విక్రమసింఘే ఈ ఏడాది మేలో లంక ప్రధానిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మహింద రాజపక్స ప్రధానిగా గద్దె దిగగా రణిల్ విక్రమసింఘే ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రణిల్ విక్రమసింఘే లంక అధ్యక్ష పదవి రేసులో ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నారు. విక్రమసింఘే యునైటెడ్ నేషనల్ పార్టీకి లంక పార్లమెంట్‌లో కేవలం ఒక్క సీటు మాత్రమే ఉన్నప్పటికీ.. అధికార ఎస్‌ఎల్‌పీపీ నుంచి ఆయనకు గట్టి మద్దతు ఉంది. గొటబాయ రాజపక్స సోదరుడు బాసిల్ రాజపక్స కూడా విక్రమసింఘేకి మద్దతునిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా రణిల్ విక్రమసింఘేనే చూస్తున్నారు. విక్రమసింఘే అయితేనే లంక ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కార మార్గం చూపగలరని ఎస్‌ఎల్‌పీపీ నేతలు భావిస్తున్నారు. అయితే ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత అధ్యక్ష రేసులో ఆయనకు ప్రతికూలాంశం.
సాజిత్ ప్రేమదాస :
శ్రీలంకలో ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవెగాయ నేత సాజిత్ ప్రేమదాస పేరు కూడా అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తోంది. అయితే ఆయన పార్టీకి పార్లమెంట్‌లో కేవలం 50 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ప్రేమదాస అధ్యక్షుడు కావాలంటే అధికార పార్టీ ఎంపీల మద్దతు అవసరం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చదివిన ప్రేమదాస 1993లో అప్పటి లంక అధ్యక్షుడు, తన తండ్రి ప్రేమదాస రణసింఘే ఆత్మాహుతి దాడిలో చనిపోవడంతో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు.
2000 సంవత్సరంలో ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆయన 2018లో డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌గా పనిచేశారు. ప్రస్తుత అధికార పార్టీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని.. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని.. అధ్యక్ష పదవికి ప్రేమదాస అయితేనే దేశం బాగుపడుతుందని ఎస్‌జేబీ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఎంపీ డల్లాస్ అలహప్పెరుమా :
అధ్యక్ష రేసులో వినిపిస్తున్న మూడో పేరు డల్లాస్ అలహప్పెరుమా. అధికార ఎస్ఎల్‌పీపీకి చెందిన డల్లాస్ అలహప్పెరుమాకి ఆయన పార్టీలో ఒక వర్గం మద్దతునిస్తోంది. 63 ఏళ్ల అలహప్పెరుమా 1994లో మొదటిసారి ఎంపీ అయ్యారు. మాస్ మీడియా మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. లంక సంక్షోభ కాలాన్ని అలహప్పెరుమా మాత్రమే సమర్థవంతంగా డీల్ చేయగలరనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.
శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో అధికార ఎస్‌ఎల్‌పీపీ సంఖ్యా బలం 117. గొటబాయ రాజపక్స రాజీనామా నేపథ్యంలో వచ్చే వారం స్పీకర్ పార్లమెంట్‌ను సమావేశపరచనున్నారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.
Also Read: Telangana Politics: ఏపీ సీఎం జగన్‌తో టీఆర్ఎస్ కీలక నేత చర్చలు.. కేసీఆర్ డైరెక్షన్ లోనే కలిశారా?
Also Read: Horoscope Today July 15th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారికి గడ్డుకాలం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook