ఏపీ పాలిటిక్స్‌లో మరో సరికొత్త కోణం బయటపడడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఏపీకి స్పెషల్ స్టేటస్ అందివ్వకపోవడాన్ని నిరసించి తెలుగుదేశం నాయకులు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవులకు అశోకగజపతిరాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేయడంతో.. వారి స్థానాల్లో మళ్లీ ఏపీ నుంచే పలువురు బీజేపీ నాయకులకు అవకాశం కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పేరు కూడా రేసులో ఉన్నట్లు వినికిడి.
శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీకి చెందిన పలువురు బీజేపీ నాయకులు భేటీ అయిన క్రమంలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ హరిబాబుకి కేంద్ర మంత్రి పదవి ఇస్తే..బీజేపీ రాష్ట్ర కమిటీ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా అధిష్టానం తర్జనభర్జనలు పడుతుందని పలువురు అంటున్నారు.
ఆ రేసులో విష్ణుకుమార్ రాజుతో పాటు ఆకుల సత్యనారాయణ, సోము వీర్రాజు కూడా ఉండే అవకాశం ఉందని పలు పత్రికలు వార్తలు రాశాయి. అలాగే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ కూడా బీజేపీ నేతలతో కలిసి అమిత్ షాను కలవడం పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు కొందరు రాజకీయవేత్తలు. ఇప్పటికే బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ... ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా అదే స్థాయిగల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని తెలిపిన సంగతి తెలిసిందే...!