తండ్రిని అరెస్ట్ చేయించిన 11 ఏళ్ల బాలుడు

11 ఏళ్ల ఆ బాలుడు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాలుడి తండ్రిని అరెస్ట్ చేశారు

Last Updated : Feb 24, 2018, 03:45 PM IST
తండ్రిని అరెస్ట్ చేయించిన 11 ఏళ్ల బాలుడు

తాగి ఇంటికొచ్చి, భార్య పిల్లలపై చేయి చేసుకుంటూ వారిని వేధింపులకు గురిచేస్తోన్న ఓ తండ్రికి తగిన బుద్ధి చెప్పాడు ఓ బాలుడు. నిత్యం పూటుగా మందుతాగి ఇంటికొస్తున్న తండ్రి ఇంట్లో తల్లిపై, సోదరిని చిత్ర హింసలు పెడుతున్న తీరు చూసి విసిగిపోయిన ఆ బాలుడు తన తండ్రిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోజూ ఇంట్లో తన తండ్రి చేస్తోన్న ఆగడాలపై పోలీసులకు పూస గుచ్చినట్టు వివరించాడు. 11 ఏళ్ల ఆ బాలుడు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాలుడి తండ్రిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఇలాంటి తండ్రుల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న ఎంతో మంది చిన్నారులకు, అభాగ్యులకు ఆదర్శంగా నిలిచింది. 

జమ్మికుంటకు చెందిన ములుగు శ్రీనివాస్‌కి భార్య, ఓ కూతురు, కొడుకు వున్నారు. నిత్యం తొగి ఇంటికొస్తున్న ములుగు శ్రీనివాస్.. ఇంట్లో భార్య పిల్లలను వేధించడం ఓ అలవాటుగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం తాగి ఇంటికొచ్చిన శ్రీనివాస్.. ఆ సమయంలో భార్య ఇంట్లో లేకపోవడం చూసి ఆగ్రహానికి గురయ్యాడు. ఏదైనా పని మీద బయటికి వెళ్లి వుంటుందేమో అని ఆలోచించే విచక్షణ కూడా లేకుండా ఇంట్లో వున్న కొడుకుపై తన ప్రతాపం చూపించాడు. వేడివేడిగా వున్న వంటను బాలుడిపై విసిరి తన రాక్షసంగా ప్రవర్తించాడు. బాలుడు వేసిన కేకలు విని అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వెంటనే ఆ బాలుడిని తండ్రి చేతుల్లోంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు.

 

ప్రస్తుతం ఆ కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు శ్రీనివాస్‌ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. 

Trending News