తన భార్యా లావుగా ఉందనే కారణాన్ని సాకుగా చూపించి, ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబ్వలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గత కొంత కాలంగా భార్యను లావుగా ఉన్నావని వేధిస్తూ వస్తోన్న ఆరిఫ్ హుస్సేన్ అనే వ్యక్తి ఇటీవల ఆమెకు ఏకంగా త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. దీంతో మంగళవారం ఆమె మేఘనగర్ పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్స్ 498(ఏ) (గృహహింస), 323 (హింసించినందు) కింద కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత మధ్యప్రదేశ్‌లో నమోదైన కేసు ఇదే మొదటిది కావచ్చని జబ్వ పోలీసులు అభిప్రాయపడినట్టుగా డెక్కన్ క్రానికల్ ఓ కథనాన్ని ప్రచురించింది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 10 ఏళ్ల క్రితం హుస్సేన్‌తో ఆమె వివాహం కాగా పెళ్లయిన మొదటి రెండేళ్లు కాపురం సజావుగానే సాగింది. అయితే, ఇద్దరు పిల్లలు పుట్టాకా తాను లావుగా తయారయ్యానని తన భర్త వేధించడం మొదలుపెట్టాడని ఆమె పోలీసుల ఎదుట వాపోయారు.
భార్య లావుగా ఉందని...