Nara Lokesh Return Gift Comments: మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ఈకో హిల్ పార్కును బుధవారం ఏపీ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. ప్రజల అభిస్టాన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు కచ్చితంగా గెలుస్తాం అని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నేతలు, కోఆర్డినేటర్లతో సమావేశమైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం మరోసారి 175 కి సీట్లు గెలుస్తామని.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ధీమా వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మరోసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం గుర్తుచేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తప్పుపట్టడాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. అవినీతికి పాల్పడిన వారిపై, తప్పు చేసిన వారిపై కేసులు పెట్టడం కక్ష్య సాధింపు చర్యలు కానే కాదు అని అన్నారు. అంతేకాదు.. చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేసి ఉంటే అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు అని స్పష్టంచేశారు.
చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినందుకు వైసిపి ప్రభుత్వానికి 6 నెలల్లో రిటర్న్ గిఫ్టు ఇస్తామని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. నారా లోకేష్ అధికార పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కాదు, ముందుగా మీ చంద్రబాబు నాయుడును ఆయన సొంత స్థానం అయిన కుప్పం నియోజకవర్గం నుండి గెలిపించుకొమ్మనండి చూద్దాం అని నారా లోకేష్ కి, తెలుగు దేశం పార్టీ శ్రేణులకు సవాల్ విసిరారు.
ఇక ఇదిలావుంటే, మంగళగిరి నగర వాసులకు విజ్ఞానం, ఆహ్లాదాన్ని పంచేందుకు టెంపుల్ ఎకో హిల్ పార్క్ ముస్తాబైంది. పార్కును సందర్శించే వారికి ఔషధ విజ్ఞానం తెలియజేసేలా పార్కులో వందలాది ఔషధ మొక్కలను నాటారు. ఆహ్లాదాన్ని పంచేలా అందమైన పూలవనాలను పెంచుతున్నారు. పెద్దపెద్ద రాళ్లను గుట్టలుగా పేర్చి పార్క్‌ను సహజసిద్ధంగా తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ఆటపరికరాలను, సందర్శకుల కోసం ఓపెన్ జిమ్, యోగా కేంద్రం, తాగు నీరు, టాయిలెట్స్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎయిమ్స్ ఆసుపత్రి గేటు సమీపంలో రూ.1.50కోట్ల వ్యయంతో తీర్చిదిద్దిన టెంపుల్ హిల్ ఎకో పార్క్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. విజ్ఞానం, వినోదంతో సకల సౌకర్యాలు ఉన్న ఏకో పార్కును అందరు వినియోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అక్కడి పరిసర ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేశారు.