Minister KTR: అది వారి తలనొప్పి.. మాకు సంబంధం లేదు.. చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్

KTR On Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అది వాళ్ల తలనొప్పి అని.. తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 12, 2023, 04:08 PM IST
Minister KTR: అది వారి తలనొప్పి.. మాకు సంబంధం లేదు.. చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్

KTR On Chandrababu Naidu Arrest: ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 90 స్థానాలకు పైగా గెలుస్తామని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పది సంవత్సరాల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉందని.. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని అన్నారు.

"కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష. ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమే.. సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయి. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ గారు సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారు. కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ గారు. ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి.

ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్. తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావుపైనే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్‌ది. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా..? తెలంగాణ బిడ్డ కావాలా..? తెలుసుకోవాలి. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిలలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తామంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది.

పదేళ్లు సాధించిన అభివృద్ధిని.. తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా ప్రజలు తెలుసుకోవాలి. పైకి కనబడేది కిషన్ రెడ్డి అదించేది  కిరణ్ కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా..? ఒక్కరన్న రాజీనామా చేశారా..?
నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా..? లేదా జీవితాన్ని వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి సర్కారు కావాలా..? ఇంత భావ దారిద్య్రం, లేకితనం కలిగిన ప్రతిపక్షాలతో పోటీ పడాల్సి రావడమే ఈ రాష్ట్రం దురదృష్టం.." అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై కేటీఆర్‌ను ప్రశ్నించగా.. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి ఏం లేదని అన్నారు. అది వారి తలనొప్పి అని.. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో తమకు సంబంధం లేదన్నారు. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Also Read: IND Vs SL Asia Cup Super 4 Match Updates: టాస్ గెలిచిన భారత్.. తుది జట్టులో మార్పులు.. ఆ ప్లేయర్ ఎంట్రీ..!  

Also Read: Ys jagan on Chandrababu Case: చంద్రబాబు అరెస్టు పరిణామాలపై జగన్ సమీక్ష

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News