10 పసందైన పానీపూరీలు..మీకోసం

  

Last Updated : Nov 3, 2017, 08:12 PM IST
10 పసందైన పానీపూరీలు..మీకోసం

పానీపూరీ.. నేడు ఉత్తరాదితో పాటు దక్షిణాది వారు కూడా బాగా ఆదరిస్తున్న వంటకం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా.. ఒక్కో పేరుతో ఈ వంటకాన్ని పిలుస్తారు. దాదాపు ఈ పానీపూరీకి పది వేరు వేరు పేర్లు  కూడా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో పానీపూరీలో ఒక్కో విధమైన కర్రీ వాడతారు. అయినా దేని ప్రత్యేకత దానిదే. పానీపూరి అభిమానుల కోసం 10 పసందైన పానీపూరీల గురించి మనం తెలుసుకుందాం.. 

పానీపూరి - మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు నేపాల్ దేశంలో కూడా చాలా మంది పానీపూరీని తింటారు. హాట్ రగడా (తెల్లని బఠానీల ముద్ద)తో పాటు పుల్లని చింతపండు రసాన్ని ఈ  పూరీల్లో  వేస్తారు. కొన్ని చోట్ల బంగాళాదుంపల కూరతో పాటు, చట్నీ, బూందీని కూడా కలిపిన మిశ్రమాన్ని పానీపూరీల్లో వేసి సర్వ్ చేస్తుంటారు.

పుచ్కా - పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పానీపూరినే పుచ్కా అంటారు. మామూలు పానీపూరీలతో పోల్చుకుంటే పుచ్కా కొంత వేరేగా ఉంటుంది. ఉడకబెట్టిన శనగలు, బంగాళాదుంప కూరతో పాటు మసాలా దట్టించిన రసాన్ని పూరీల్లో వేసి ఇస్తారు. బెంగాల్‌తో పాటు జార్ఖండ్, బిహార్ ప్రాంతాల్లో కూడా పుచ్కా బాగా పాపులర్.

గోల్ గప్పా - ఉత్తరాదిలో గోల్ గప్పా పేరుతో పానీపూరీలు చాలా చోట్ల దొరుకుతాయి. హర్యానా తప్ప దాదాపు అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోల్ గప్పా అనే పదాన్నే ఎక్కువగా వాడతారు. మసాలా దట్టించిన శనగలు, బాగా ఉడకబెట్టిన బంగాళాదుంపలను మిశ్రమంగా చేసి పుదీనా దట్టించిన నీటితో గోల్ గప్పాలను సర్వ్ చేస్తారు. 

పకోడి పూరీలు - గుజరాత్‌లో కొన్ని చోట్ల పానీపూరీని పోలే పకోడి పూరీలు లభ్యమవుతాయి. సేవుతో పాటు తియ్యని చట్నీ, ఉల్లిపాయలు దట్టించిన మిశ్రమాన్ని పూరీల్లో వేసి అందిస్తారు. పూదీనా, పచ్చిమిరపకాయ పౌడరు కలగలిపిన నీటితో వీటిని సర్వ్ చేస్తారు.  మిగతా పూరీలతో పోల్చుకుంటే ఇవి చాలా స్పైసీగా ఉంటాయి 

పానీ కే పటాషే - హర్యానాలో గోల్ గప్పాలను "పానీ కే పటాషే" అనే పేరుతో పిలుస్తారు. దాదాపు గోల్ గప్పాను పోలిన రెసిపీనే వాడతారు. కానీ మిగతా పానీపూరీలతో పోల్చుకుంటే పటాషేలు చాలా కారంగా ఉంటాయి.

పటాషీ - రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో పానీపూరీలను పోలిన వంటకం పేరు  పటాషీ. ఇందులో సర్వ్ చేయడానికి ఉపయోగించే రసాన్ని పుల్లటి మామిడికాయలతో తయారుచేస్తారు. ఆ రసాలలో కూడా అయిదు రకాలు ఉన్నాయట. "పాంచ్ స్వాద్ కా పటాషీ" అనే పేరుతో ఆ అయిదు రసాలు ఉంటాయి. అందులో ఒకటి తియ్యగా ఉండగా, మిగతా నాలుగు కారంగా, పుల్లగా, వగురుగా, స్పైసీగా ఉంటాయట. కొమ్ముశనగలు, బంగాళాదుంపలను స్టఫ్ఢ్ చేసి కర్రీగా ఈ పటాషీల్లో వేసి అందిస్తారు

గప్ షుప్ - పానీపూరీలను కొన్ని ప్రాంతాల్లో గప్‌షుప్‌లు అని కూడా అంటారు. ఒడిషా, ఛతీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి లభిస్తుంటాయి. కేవలం బఠానీలతో పాటు స్పైసీ వాటర్‌‌ని మాత్రమే వీటితో అందిస్తారు. బంగాళాదుంపల కర్రీ మాత్రం వీటిలో వాడరు 

ఫుల్కి - పానీపూరీల్లో కర్రీతో పాటు కాస్త పెరుగును వేసి అందిస్తే.. అది ఫుల్కి అయిపోతుంది. వీటినే "దహీ ఫుల్కి" అంటారు. ఉత్తర ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి దొరుకుతాయి

టిక్కి - మధ్యప్రదేశ్‌లోని హొషంగాబాద్ ప్రాంతంలో పానీపూరీని టిక్కీ అంటారు. సైజు బాగా చిన్నగా ఉండే పూరీలు ఇవి

పడకా - అలీఘర్ ప్రాంతంలో పానీపూరీలను పడకా అని పిలుస్తారు. ఇవి కూడా చిన్నసైజులోనే ఉంటాయి.  

Trending News