పెట్రోల్ కోసం సరిహద్దు దాటుతున్న వాహనదారులు

అక్కడ లీటర్ పెట్రోల్ ₹13 తక్కువ.. క్యూ కడుతున్న వాహనదారులు

Last Updated : May 29, 2018, 03:38 PM IST
పెట్రోల్ కోసం సరిహద్దు దాటుతున్న వాహనదారులు

దేశంలో పెట్రోల్‌ ధరలు ఆల్ టైం రికార్డును తాకుతుంటే.. బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేపాల్‌ సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెట్రో, డీజిల్ సెగల నుండి తప్పించుకునేందుకు సరికొత్త దారులు వెతికారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకోవడానికి పొరుగు దేశం నేపాల్‌కు వెళ్తున్నారు. అంతేనా వాహనాల్లో అక్కడికి వెళ్లి క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తెచ్చుకుంటున్నారు. మరికొందరు డబ్బు ఆశ కోసం అమ్ముతున్నారు. సరిహద్దు రక్షణ దళం (బీఎస్ఎఫ్) జవాన్లు చూస్తుండగానే వారు సరిహద్దు దాటుతున్నారు.

దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్న స్థానికులు డబ్బును ఆదా చేసుకోవడం కోసం నేపాల్ వెళ్తున్నారు. భారత్‌ సరిహద్దుల్లో గత కొద్దిరోజులుగా పెట్రోల్‌ విక్రయాలు 15 నుంచి 20 శాతం పెరిగాయని నేపాల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారి పేర్కొన్నారు.

భారత్‌తో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్ ధరలు చౌక. నేపాల్‌లో లీటర్ పెట్రోల్‌ మనకంటే (భారత్) రూ.12-13 తక్కువగా ఉంటుంది. డీజిల్‌ కూడా ఇంచుమించు అంతే.' అని స్థానికులు తెలిపారు. ఇలా సరిహద్దు దాటుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచినట్లు ఎస్పీ సభా రాజ్ తెలిపారు.

నేపాల్‌కు సైతం భారత్‌ పెట్రోలియం ఉత్పత్తులను భారత్‌ సరఫరా చేస్తోంది. రోజూ 250 ట్యాంకర్ల ఆయిల్‌ నేపాల్‌ సరఫరా అవుతోంది. భారత్‌లో ద్వంద పన్నుల వ్యవస్థ (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు) అమల్లో ఉండగా, నేపాల్‌లో ఏక పన్ను వ్యవస్థ అమల్లో ఉంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 16వ రోజు మంగళవారం నాడు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹78.43, డీజిల్ ధర ₹69.31గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ₹86.24, డీజిల్ ధర ₹73.79గా ఉంది. మెట్రో నగరాల్లో చూస్తే అత్యంత తక్కువ దేశ రాజధాని ఢిల్లీలోనే లభిస్తుంది. కొన్ని రాష్ట్ర రాజధానుల్లో స్థానిక పన్నులు లేదా వ్యాట్‌ ధరల ఆధారంగా ధరలు ఉంటాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ₹83.08, డీజిల్ ధర ₹75.34గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹84.278, డీజిల్ ధర ₹76.245గా ఉంది.

Trending News