బెంగళూరు: ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయనకు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందంటూ సోషల్ మీడియా, వాట్సాప్లో గత కొద్ది రోజులుగా ఓ ఫోటో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, అందులో వాస్తవం లేదని, ఆ ఫేక్ న్యూస్ ఫోటో వెనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తోన్న మఝూర్ అహ్మెద్ కుట్ర ఉందంటూ ప్రకాష్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తోన్న తాను, అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తోన్న రిజ్వాన్ ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నామని, ఆ సమయంలో ఇద్దరం కలిసి షేక్ హ్యాండ్ ఇస్తుండగా తీసిన ఫోటోను ఇలా దుష్ప్రచారానికి వాడుకున్నారని ప్రకాష్ రాజ్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రకాష్ రాజ్ ఫిర్యాదుపై ఇసి ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.