న్యూఢిల్లీ: పాపులారిటీలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పేజీ టాప్‌లో నిలిచింది. 2017 సంవత్సరానికి సంబంధించిన లోక్‌సభ ఎంపీల్లో నరేంద్ర మోదీ టాప్‌లో ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండవ స్థానంలో, పంజాబ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ మూడవ స్థానంలో ఉన్నారు.
కాగా ఇదే కేటగిరీ రాజ్యసభ ఎంపీల్లో సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో, ఆర్‌కే సిన్హా రెండవ స్థానంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడవ స్థానంలో నిలిచారు. భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలు, మంత్రివర్గాలు, రాజకీయ పార్టీల ఫేస్‌బుక్ పేజీల డేటా ఆధారంగా దీన్ని రూపొందించింది ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన సమాచారానికి వచ్చే లైకులు, షేర్ల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు.
ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫేస్‌బుక్ పేజీ అన్ని ముఖ్యమంత్రుల ఫేస్‌బుక్ పేజీలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రెండో స్థానంలో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దేశంలో ముఖ్య మంత్రులలో మూడవ స్థానంలో నిలిచారు.