జనాలు తిరస్కరించినప్పటికీ సీఎం అయ్యా': కుమార స్వామి

మంత్రి పదవుల్లో ఇరుపార్టీల మధ్య ఎలాంటి విభేదాల్లేవని.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. 

Last Updated : May 28, 2018, 11:00 PM IST
జనాలు తిరస్కరించినప్పటికీ సీఎం అయ్యా': కుమార స్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగళూరులో ఆదివారం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్థంతి సందర్భంగా విధానసౌధలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.

తనకు స్వేచ్ఛ లేదని కుమారస్వామి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి తాను బాధ్యుడినని, ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వహిస్తానన్నారు. అయితే ఏం చేయాలన్నా తనకు కాంగ్రెస్ నాయకుల మద్దతు అవసరమని, వారి మద్దతు, సహకారం, అనుమతి లేకుండా ఏం చేయలేనని అన్నారు. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నానని, కాంగ్రెస్ మద్దతుతో రుణమాఫీ చేసి తీరుతానని అన్నారు. ‘ఆరున్నర కోట్ల మంది (జేడీఎస్‌)ను తిరస్కరించారు. కానీ, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో నేను ముఖ్యమంత్రినయ్యాను. కాంగ్రెస్‌కు నేను కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ సమస్య త్వరలోనే  పరిష్కారం అవుతుంది’ అని సీఎం కుమారస్వామి చెప్పారు. మంత్రి పదవుల్లో ఇరుపార్టీల మధ్య ఎలాంటి విభేదాల్లేవని.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు.  

రుణమాఫీపై మూడురోజుల్లో నిర్ణయం చెప్పకుంటే బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామనడం సిగ్గు చేటన్నారు. ఈ పరిస్థితులలో బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం సరికాదన్నారు. ఆందోళనలతో అన్నీ జరగవని అన్నారు.

నేడు ప్రధాని మోదీతో భేటీ...

ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాజ్ ఘాట్‌లో మహాత్ముడికి నివాళులు అర్పించి.. సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టులు, సాయాలపై పలువురు కేంద్రమంత్రులతో సమావేశమై చర్చిస్తారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీని కలవాలనుకున్నా వారు విదేశీ పర్యటనలో ఉండటంతో వారిని కలిసే అవకాశం లేదు.

Trending News