చెన్నై: డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన కొడుకు, సినీనటుడు అయిన ఉదయ నిధి స్టాలిన్‌ని డిఎంకే పార్టీ యూత్ వింగ్ కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు గురువారం పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు నియామక పత్రాలు అందజేసి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎంకే స్టాలిన్ కూడా ఆ పదవిలో 35 ఏళ్లపాటు కొనసాగిన వారే. ఎంకే స్టాలిన్ తర్వాత ఆ స్థానంలో ఎంపి సామినాథన్ ఉండేవారు. సామినాథన్ ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆ స్థానం ఖాళీగానే ఉంటూ వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ను కార్యదర్శిగా నియమించి పార్టీలో ఖాళీగా వున్న ఆ పోస్టును భర్తీ చేసినట్టు సమాచారం.
పార్టీలో అధికారికంగా ఉదయనిధి స్టాలిన్‌కు పదవి దక్కడం ఇదే తొలిసారి అయినా.. గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారంలో చురుకుగా పాల్గొన్న స్టార్ క్యాంపెయినర్స్‌లో ఆయన కూడా ఒకరు. రెడ్ జియాంట్ మూవీస్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తొలుత సిని నిర్మాతగా ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఉదయనిధి స్టాలిన్.. 2012లో ఓరు కల్ ఓరు కన్నడి అనే సినిమాతో నటుడిగానూ మారారు.