Tax On Petrol Diesel : ధరల పాపం మీదంటే మీదంటున్న నేతలు..కేంద్రం - రాష్ట్రాల మధ్య పెట్రోల్‌ మంట..!

Tax On Petrol Diesel : పెట్రోల్‌ డిజిల్‌ ధరలపై ఇప్పుడు వింత వాదన నడుస్తోంది. వినియోగదారులకు, ప్రభుత్వాలకు మధ్య కొనసాగాల్సిన రగడ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెస్పాండ్‌ అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 06:56 PM IST
  • ధరల పాపం మీదంటే మీదంటున్న నేతలు
  • కేంద్రం - రాష్ట్రాల మధ్య పెట్రోల్‌ మంట
  • ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రెస్పాండ్‌ అవుతున్న ముఖ్యమంత్రులు
Tax On Petrol Diesel : ధరల పాపం మీదంటే మీదంటున్న నేతలు..కేంద్రం - రాష్ట్రాల మధ్య పెట్రోల్‌ మంట..!

Tax On Petrol Diesel: పెట్రోల్‌ డిజిల్‌ ధరలపై ఇప్పుడు వింత వాదన నడుస్తోంది. వినియోగదారులకు, ప్రభుత్వాలకు మధ్య కొనసాగాల్సిన రగడ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెస్పాండ్‌ అవుతున్నారు. కేంద్రం ధరలు పెంచితే, తాము పన్నులు తగ్గించాలా? అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను దెబ్బతీసే పరిస్థితి నెలకొంది.

సాధారణంగా పెట్రోల్‌ ధరల పెంపుపై జనం ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోయాలి. కానీ, పన్నులు మీరు తగ్గించాలంటే మీరు తగ్గించాలంటూ అటు ప్రధాని, ఇటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాగ్బాణాలు విసురుకుంటున్నారు. అది కాస్తా ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

కొంతకాలంగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ధరల తగ్గింపు అంశం ఎవరి పరిధిలో ఉందన్న విషయంపై తీవ్రస్థాయిలో చర్చలు సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్ల గుర్రుగా ఉన్న ఆయా రాష్ట్రాల ప్రధాన పార్టీల నేతలకు, ముఖ్యమంత్రులకు ఓ అస్త్రం దొరికినట్టయ్యింది.

ఈనెల 27వ తేదీన దేశంలో కొవిడ్‌ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని నరేంద్రమోడీ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆ సందర్భంగా మోడీ పెట్రోల్‌ ధరలపై వ్యాఖ్యానించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రం పన్నులు తగ్గిస్తున్నా రాష్ట్రాలు తగ్గించకపోవడం సహేతుకం కాదని అన్నారు. గతయేడాది నవంబర్‌లో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిందని, రాష్ట్రాలు కూడా ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ తగ్గించాలని కోరామని, అయినా తగ్గించడం లేదన్నారు నరేంద్రమోడీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో పన్నులు తగ్గించలేదని ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల పేర్లు ప్రస్తావించారు. కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో వ్యాట్‌ తగ్గించారని కూడా మోడీ గుర్తు చేశారు.  పన్నులు తగ్గించని రాష్ట్రాల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడం లేదన్నారాయన.

దీనిపై ఆయా రాష్ట్రాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్రంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అదేరోజు తెలంగాణ సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికగా ప్రధానిపై భగ్గుమన్నారు. ఇవి ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు. కరోనా గురించి సమావేశం ఏర్పాటు చేసి పెట్రోల్‌ ధరల గురించి మాట్లాడటమేంటన్నారు. ధరలు మీరు పెంచితే, మేము తగ్గించాలా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ అంశంపై స్పందించారు. పొలిటికల్‌ ఎజెండాలో భాగంగానే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కొవిడ్‌ సమావేశంలో మిగతా అంశాల గురించి ప్రస్తావించడమేంటని ప్రశ్నించారు. పెట్రోల్‌పై ఒక రూపాయి తగ్గించామని దీని వల్ల మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1500 కోట్ల భారం పడిందని అన్నారు. అయినా, ఇలాంటి వాటి గురించి మోడీ ప్రస్తావించబోరని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి పశ్చిమ బెంగాల్‌కు రూ. 97 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్న మమత.. బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలపై నిందలు వేస్తూ ప్రజాస్వామ్యాన్ని బుల్డోజర్లతో పడగొట్టవద్దని సూచించారు.

కేంద్రం పన్నులు పెంచిన ప్రతిసారీ తమిళనాడు ప్రభుత్వం టాక్స్‌లు తగ్గిస్తూనే ఉందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గించినప్పుడు కూడా కేంద్రం పెట్రోల్‌ రేట్లు తగ్గించలేదన్నారు.

మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా ఈ అంశంపై రెస్పాండ్ అయ్యారు. పెట్రోల్‌ ధరలకు కొన్ని రాష్ట్రాలే కారణమని నిందలు వేయడం సమాఖ్య వ్యవస్థలో సరికాదన్నారు. ధరల పెంపును రాష్ట్రాలపై నెట్టేయడం వల్ల సామాన్యుల ఆర్థిక కష్టాలు తీరవన్నారు.

ఇక, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ అంశంలో కేంద్రంపై ఫైరయ్యారు. దేశంలో పెట్రోల్‌ ధరలు పెరిగినా, బొగ్గుకు కొరత ఏర్పడినా, ఆక్సిజన్‌ దొరక్కపోయినా రాష్ట్రాలనే నిందించడం అనేది కేంద్రం పనిగా పెట్టుకుందని రాహుల్ విమర్శించారు. పెట్రోల్‌పై వచ్చే పన్ను వసూళ్లలో 68శాతం కేంద్రం ఖజానాకే చేరుతోందని, కానీ.. ధరల పెరుగుదల అపవాదును మాత్రం రాష్ట్రాలపై నెట్టేయడం సమంజసం కాదని హితవు పలికారు. రాష్ట్రాలను బెదిరించే ధోరణిలో మోడీ మాట్లాడుతున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

Also Read: Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. దోషికి ఉరి శిక్ష!

Also Read: Acharya OTT Release Date: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ అప్పుడే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News