కాంగ్రెస్‌లోకి హార్థిక్ పటేల్.. లోక్ సభ సీటు ఖరారు !

కాంగ్రెస్‌లోకి హార్థిక్ పటేల్.. లోక్ సభ సీటు ఖరారు !

Last Updated : Mar 8, 2019, 11:40 AM IST
కాంగ్రెస్‌లోకి హార్థిక్ పటేల్.. లోక్ సభ సీటు ఖరారు !

న్యూఢిల్లీ: గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమానికి నేతృత్వం వహించిన పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు గుజరాత్ నేతలు పీటీఐకి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో హార్థిక్ పటేల్ ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి హార్ధిక్ పటేల్‌కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం జామ్‌నగర్ నుంచి బీజేపి తరపున గెలిచిన పూనం ఎంపీగా వున్నారు. జామ్‌నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఆహిర్ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో వున్నారు. దీంతో చివరి మూడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. అందులో పూనం రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఆహిర్ సామాజిక వర్గం తర్వాత అధిక ఓటు బ్యాంక్ కలిగిన వర్గం పటేల్ సామాజిక వర్గం కావడంతో.. ఈసారి ఎలాగైనా ఇక్కడి నుంచి పూనంపై హార్థిక్ పటేల్‌ని పోటీకి దింపి... బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీని కాస్త ఆహిర్, పటేల్ సామాజిక వర్గం మధ్య పోటీగా మల్చుకుని విజయం సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు అక్కడి రాజకీయ పార్టీలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలావుంటే, జామ్‌నగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 శాసన సభ నియోజకవర్గాలు వుండగా.. అందులో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే 4 స్థానాలు గెల్చుకుంది. దీంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇక్కడ మరింత బలం పెరిగే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Trending News