యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) పరీక్షలు నిన్నే ప్రారంభమయ్యాయి. దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాశారు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం పేపర్ చాలా కష్టంగా ఉందని ఇప్పటికే పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తాను ఆలస్యంగా వస్తే.. పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదని పేర్కొంటూ వరుణ్ అనే 28 సంవత్సరాల కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
న్యూఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వరుణ్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తను సూసైడ్ నోట్ కూడా రాశాడు. నిబంధనలు అనేవి ఉండాల్సిందేనని.. కాకపోతే అభ్యర్థుల వైపు నుండి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలోని పహర్ గంజ్ సెంటర్ పరీక్షా కేంద్రంలో తను పరీక్ష రాయాల్సి ఉంది. రాజేంద్ర నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వరుణ్ ఆలస్యంగా వెళ్లడంతో తనను పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించలేదు. కర్ణాటకకు చెందిన ఆ కుర్రాడు పరీక్ష రాయలేదన్న బాధకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.