సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ని ఏకిపారేసిన 'ఆ నలుగురు' !

దేశంలో ఇంతకు ముందెప్పుడూ చోటుచేసుకోని ఘటన ఇది.

Last Updated : Jan 13, 2018, 02:27 PM IST
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ని ఏకిపారేసిన 'ఆ నలుగురు' !

దేశంలో ఇంతకు ముందెప్పుడూ చోటుచేసుకోని ఘటన ఇది. దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టుకి చెందిన నలుగురు సీనియర్ జస్టిస్‌లు ఒకేసారి తిరుగుబాటుబావుటా ఎగరేయడం! అది కూడా ఇంకెవరిపైనో కాదు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పైనే. అవును శుక్రవారం ఆ నలుగురు న్యాయమూర్తులైన జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగొయి, మదన్ లోకూర్, కురియెన్ జోసెఫ్ ఒకే వేదికపైకి వచ్చి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. సుప్రీం కోర్టులో ఏదీ ఒక పద్ధతి ప్రకారం జరగడం లేదని ఆరోపించిన నలుగురు న్యాయమూర్తులు.. కోర్టులో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా నడుచుకుంటోందని అన్నారు. కేసులని వివిధ బెంచ్‌లకి కేటాయించే క్రమంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నియననిబంధలు పాటించకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాము చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకొచ్చినా.. ఆయన పట్టించుకోవడం లేదని నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ పై తమ అసంతృప్తిని వ్యక్తంచేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రెస్‌మీట్‌లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. 'గత కన్ని నెలలుగా జరగాల్సినవి జరగాల్సిన విధంగా జరగడం లేదు' అని అన్నారు. దేశానికి, న్యాయ వ్యవస్థకు రుణపడి వున్నాం కనుకే ఇక్కడ జరుగుతున్నవి తమకు నచ్చడం లేదని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు ప్రకటించిన నలుగురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ తర్వాత అత్యున్నత ర్యాంకింగ్ కలిగి వున్న ఈ నలుగురు న్యాయమూర్తులు.. ప్రస్తుతం దేశ ప్రజాస్వామ్యానికి హాని పొంచి వుందని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పడం సంచలననానికి దారితీసింది. 

ఈ ఘటన తర్వాత న్యాయశాఖ మంత్రిరవిశంకర్ ప్రసాద్‌ని హుటాహుటిన పిలిపించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. అసలు ఏం జరుగుతోందని మంత్రి నుంచి ఆరాతీశారు. ఈ ఘటనపై కొందరు ప్రముఖులు నలుగురు న్యాయమూర్తులవైపు నిలిస్తే, ఇంకొందరు ఈ పరిణామాన్ని తేలిగ్గానే పరిగణిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

Trending News