బడ్జెట్ 2018 కోసం లక్ష కోట్లకు కేంద్రం స్కెచ్ !

హెచ్‌పీసీఎల్‌లోని 51శాతం ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ఓఎన్‌జీసీ

Last Updated : Jan 31, 2018, 03:06 PM IST
బడ్జెట్ 2018 కోసం లక్ష కోట్లకు కేంద్రం స్కెచ్ !

2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఓ లక్ష కోట్ల రూపాయలని పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా సమకూర్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పావులు కదుపుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌లోని 51శాతం ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు ఓఎన్‌జీసీ సిద్ధమైంది. ఈ ఒప్పందం కోసం ఇటీవలే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందం కారణంగా అటు హెచ్‌పీసీఎల్, ఇటు ఓఎన్‌జీసీ సంస్థలకు మేలు జరుగుతుందని ఓఎన్‌జీసీ చైర్మన్ దినేష్ శరఫ్ తెలిపారు. మరో వారం రోజుల్లో ఆ దిశగా పూర్తిస్థాయిలో ఒప్పందం కూడా కుదిరే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ భారీ ఒప్పందంతో ప్రభుత్వ ఖజానాకు రూ.36 వేల కోట్లు సమకూరుతాయని భావిస్తోన్న కేంద్రం.. ఇదే తరహాలోని ఇతర పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా ప్రభుత్వ ఖాతాలో సుమారు రూ.91.2వేల కోట్లు జమ అవుతాయని అంచనా వేస్తోంది. రూ.లక్ష కోట్ల లక్ష్యంలో భాగంగా మిగతా మొత్తాన్ని సమకూర్చుకునే యోచనలో వున్న కేంద్రం.. హెచ్‌పీసీఎల్ తరహాలోనే ఇంకొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి చెందిన వాటాలని అమ్ముకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి నాటికి ఆ మొత్తాన్ని సమకూర్చుకోవడం ప్రస్తుతం ప్రభుత్వం ముందు వున్న లక్ష్యం. 

అన్నట్టు హెచ్‌పీసీఎల్‌లో వాటాల కొనుగోలు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.4,460 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.4000 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.3000 కోట్లు రుణం పొందింది. అయితే, అది వేరే విషయం అనుకోండి. 

Trending News