కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ప్రస్తుతం జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్న సల్మాన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించనుంది.
అయితే.. సల్మాన్ ఖాన్‌కు గట్టి షాకే తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై పలు సందేహాలు నెలకొన్నాయి. శనివారం బెయిల్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జిల్లా స్థాయి జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యం కావొచ్చని.. ఆయన మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. నిజానికి సల్మాన్‌కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సల్మాన్‌కు బెయిల్ వస్తుందని అందరూ అనుకున్నారు.
ప్రస్తుతం జోషి స్థానంలో చంద్ర కుమార్ సొంగారాను జడ్జిగా బదిలీ చేశారు. చంద్ర కుమార్ తీసుకునే నిర్ణయంపైనే సల్మాన్ బెయిల్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తామని సల్మాన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 20 ఏళ్ల విచారణ తర్వాత జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసింది.