జోధ్‌పూర్‌లో జింకలను వేటాడి చట్టానికి చిక్కిన సల్మాన్ ఖాన్.. అదే కేసులో శిక్ష పడ్డాక.. మళ్లీ బెయిల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరగనుంది. గతంలో ఇదే కేసులో సల్మాన్ ఖాన్‌తో పాటు నటుడు సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్లు నీలమ్, టబు, సోనాలీ బింద్రేలపై కూడా కేసులు నమోదయ్యాయి. వారు కూడా నేరంలో భాగస్తులేనని.. సంఘటన జరిగినప్పుడు వారి ప్రోద్బలంతోనే సల్మాన్ కాల్పులు జరిపారని గతంలో న్యాయవాదులు వాదించారు.
కానీ కోర్టు వారి వాదనను తోసిపుచ్చి.. ఈ కేసులో సల్మాన్ ఖాన్ తప్ప మిగతా వారినందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ తీర్పుపై మళ్లీ పిటీషన్ దాఖలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం రాజస్థాన్ ప్రభుత్వం ఇదే కేసు గురించి మాట్లాడుతూ.. తాము హైకోర్టులో ఇదే తీర్పుపై అపీల్ చేస్తామని తెలపడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ కేసులో జోధపూర్ కోర్టు ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కి అయిదు సంవత్సరాలు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు పలు సూచనలు చేసింది. ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి... విదేశాలకు ఎప్పుడైనా షూటింగ్‌ల నిమిత్తం వెళితే.. తప్పకుండా కోర్టు అనుమతి తీసుకొని మాత్రమే వెళ్లాలని తెలిపింది. వన్యప్రాణుల చట్టం ప్రకారం నల్లజింకలను వేటాడడం నేరమైనప్పటికీ.. కొన్ని సంవత్సరాల క్రితం "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని కంకణి ప్రాంతానికి సల్మాన్ ఖాన్ మిగతా నటీనటులతో కలిసి వెళ్లినప్పుడు ఈ ఘాతుకానికి ఆయన పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి.