2019 ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. తమ పార్టీ భారతదేశంలో జనాలను కూడగట్టడానికి ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ విడగొట్టడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. 2014 ఎన్ని్కలతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ఈసారి బీజేపీ గెలుపొందుతుందని అమిత్ షా అన్నారు. బీజేపీకి చెందిన రెండు రోజుల నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులు తమను ఓడించడానికి ఏర్పాటు చేసుకొనే మహా కూటమి ఏదైనా ఉంటే.. అది కేవలం వారి భ్రమ, భ్రాంతి మాత్రమేనని.. బీజేపీని ఎవరూ ఓడించలేరని అమిత్ షా అభిప్రాయపడ్డారు.
అర్బన్ నక్సల్స్ పేరిట వివాదాలు చేస్తున్నవారిని సమర్థించే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని.. తమ పార్టీ మాత్రమే పేదల కోసం, వికాసం కోసం, జాతీయత కోసం పోరాటం చేస్తుందని అమిత్ షా తెలిపారు. ఇదే కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాయి తప్పించి.. వారిది ప్రజల గొంతుక కాదని అన్నారు.
దాదాపు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన అమిత్ షా.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణలో కూడా కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చూసే దిశగా దూసుకుపోతుందని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను నమ్మే పరిస్థితి కూడా పోతుందని ఆయన అన్నారు. అలాగే ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్ గవర్నమెంట్ అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా అమిత్ షా స్పందించారు. మన్మోహన్ కేవలం తన పార్టీని మాత్రమే అనుసరిస్తారని.. కానీ మోదీని పార్టీ అనుసరిస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.