జాతీయస్థాయిలో ఖ్యాతి పొందిన.. టాలీవుడ్ దర్శకుడి మృతి

తిలదానం, కమ్లి మొదలైన చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరొందిన తెలుగు దర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి ఈ రోజు అనారోగ్యంతో మరణించారు. 

Last Updated : Sep 13, 2018, 11:38 PM IST
జాతీయస్థాయిలో ఖ్యాతి పొందిన.. టాలీవుడ్ దర్శకుడి మృతి

తిలదానం, కమ్లి మొదలైన చిత్రాలతో జాతీయ స్థాయిలో పేరొందిన తెలుగు దర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి ఈ రోజు అనారోగ్యంతో మరణించారు. బ్రాహ్మణ కుల సమస్యలపై గతంలో ఆయన తీసిన "తిలదానం" చిత్రం జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది. అదేవిధంగా తెలంగాణలో లంబాడీ స్త్రీల జీవన స్థితిగతులు, బాలికల అక్రమ రవాణా లాంటి సమస్యలకు అద్దం పట్టే "కమ్లి" చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు పొంది.. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ చిత్రంలో నటనకుగాను నందితా దాస్ ఉత్తమనటిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు. కేఎన్‌టీ శాస్త్రి ఉత్తమ చలనచిత్ర విమర్శకుడిగా, సినీ గ్రంథ రచయితగా కూడా పలు మార్లు జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు.

అలాగే పలు డాక్యుమెంటరీలు కూడా తెరకెక్కించారు. శాస్త్రి తెరకెక్కించిన "హార్వెస్టింగ్ బేబీస్" అనే డాక్యుమెంటరీ ఆమ్‌స్టర్‌డమ్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శితమై స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతంలో 1945, సెప్టెంబర్ 5 తేదిన జన్మించిన శాస్త్రి.. ఇప్పటికి 12 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 

కేఎన్‌టీ శాస్త్రి గతంలో నంది అవార్డుల కమిటీలో కూడా జ్యూరీ మెంబరుగా పనిచేశారు. అదేవిధంగా.. 2003 అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవానికి చెందిన జ్యూరీ కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. అలాగే ఆసియన్ పనోరమాకు అయిదు సార్లు జ్యూరీ మెంబరుగా పనిచేశారు. పారలెల్ సినిమాలు తీయడంలో అందె వేసిన చేయిగా శాస్త్రిని గురించి పలువురు చలనచిత్ర ప్రముఖులు చెబుతుంటారు. సికింద్రాబాద్‌లోని సిరిపురి కాలనీలో స్థిరనివాసం ఏర్పరచుకున్న శాస్త్రి సినిమాలు ఇప్పటికి 45 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఓ సరికొత్త రికార్డును నమోదు చేశాయి.

Trending News