సల్లూ భాయ్‌కి బెయిల్.. సంబరాల్లో అభిమానులు!!

సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై అతడి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

Last Updated : Apr 7, 2018, 08:34 PM IST
సల్లూ భాయ్‌కి బెయిల్.. సంబరాల్లో అభిమానులు!!

కృష్ణ జింకలను వెంటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై అతడి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గత రెండు రోజులుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో వున్న సల్మాన్ ఖాన్ నేడు రాత్రి 7 గంటలకు బెయిల్‌పై విడుదలై జైలు నుంచి బయటికి రానున్నాడు. సల్మాన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు చేస్తూ జోధ్‌పూర్ కోర్టు నుంచి ఆదేశాలు వెలువడిన మరుక్షణమే కోర్టు బయట తీర్పు కోసం వేచిచూస్తోన్న అతడి అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసింది. కోర్టు బయటే కాకుండా ముంబైలోనూ భజ్రంగీ భాయిజాన్ స్టార్ అభిమానులు అతడి ఇంటి ఎదుట ఓ సమూహంగా ఏర్పడి ఈ సందర్భాన్ని ఓ వేడుకగా జరుపుకున్నారు. సల్మాన్ ఖాన్ నుంచి రూ.50,000 విలువైన వ్యక్తిగత పూచీకత్తుతోపాటు మరో ఇద్దరు వ్యక్తుల నుంచి చెరో రూ.25,000 విలువైన పూచీకత్తును కోర్టుకు సమర్పించాల్సిందిగా షరతులు విధిస్తూ కోర్టు సల్మాన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఉదయం సల్మాన్ ఖాన్ బెయిల్ పిటీషన్‌పై విచారణ ప్రారంభించిన జోధ్‌పూర్ కోర్టు జడ్జి రవీంద్ర కుమార్ జోషినే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు. 

 

సల్మాన్ ఖాన్ కి బెయిల్ మంజూరుపై స్పందించిన డిఫెన్స్ లాయర్, కోర్టు అనుమతి లేనిదే సల్మాన్ ఖాన్ దేశం విడిచివెళ్లరాదు అని కోర్టు ఆదేశించినట్టుగా మీడియాకు తెలిపారు. డిఫెన్స్ లాయర్ వెల్లడించిన వివరాల ప్రకారం బెయిల్ డాక్యుమెంట్స్ జోధ్‌పూర్ సెంట్రల్ కోర్టుకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఓ గంట లేదా రెండు గంటల్లో.. అంటే కాస్త అటు ఇటుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో సల్మాన్ ఖాన్ బెయిల్‌ ప్రక్రియ ముగించుకుని జైలు బయటికి వస్తారని సమాచారం. 

20 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలోని కంకని గ్రామానికి ఆనుకుని వున్న అటవీ ప్రాంతంలో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 5వ తేదీన తీర్పు వెల్లడించింది. హమ్ సాత్ సాత్ హై సినిమా చిత్రీకరణ కోసం జోధ్‌పూర్‌కి వచ్చిన సల్మాన్ ఖాన్ అదే సమయంలో తన తోటి నటీనటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలి బింద్రె, సోనమ్‌లతో కలిసి కృష్ణ జింకలను వేటాడినట్టుగా అప్పట్లో జోధ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, 20 ఏళ్లపాటు సాగిన విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ ఖాన్‌ని దోషిగా భావించిన జోధ్‌పూర్ కోర్టు.. సైఫ్ అలీ ఖాన్, సొనాలి బింద్రె, టబు, సోనమ్‌లని నిర్దోషులుగా విడిచిపెట్టింది. కోర్టు తీర్పు అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు భారీ భద్రత మధ్య అదే రోజు సాయంత్రం సల్మాన్‌ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. 

Trending News