సంక్రాంతి పండగ కదా సరదాగా సినిమాకు వెళ్దాం అని థియేటర్లకి వెళ్లే సగటు ప్రేక్షకులకి ఇకపై థియేటర్‌లోకి వెళ్లకముందే టికెట్ కౌంటర్‌లోనే సినిమా కనిపించనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుపై నిర్ణయం తీసుకునేంత వరకూ పెంచిన ధరలను వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించడమే అందుకు కారణం. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపుపై విచారణ జరిపిన జస్టిస్ ఎస్వీ భట్, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఓ నిర్ణయం తీసుకునేంత వరకు థియేటర్లలో అధిక ధరలని కొనసాగించవచ్చని స్పష్టంచేసిన కోర్టు.. ధరల పెంపుదలపై అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతోపాటు ఆయా ధరల నిష్పత్తిలోనే ప్రభుత్వానికి పన్నులను చెల్లించాలని స్పష్టంచేసింది.
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని హైకోర్టుకి వెళ్లిన పలు థియేటర్ల యజమానులు.. ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకునేంత వరకూ అధిక ధరలను వసూలు చేసుకునేందుకు వీలు కల్పించాలని కోర్టుకి విజ్ఞప్తిచేశారు. థియేటర్ల యజమానుల పిటిషన్ పై స్పందిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ సంక్రాంతి పండగలోపు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే సరి.. లేదంటే అధిక ధరలు ఆడియెన్స్‌కి చుక్కలు చూపించనున్నాయి.