దటీజ్ సూర్యకాంతం..!

  

Last Updated : Oct 28, 2017, 08:07 PM IST
దటీజ్ సూర్యకాంతం..!

గుండమ్మైనా.. గయ్యాళి గంగమ్మైనా.. ఆజమాయిషీ చేసే అత్తగారి పాత్రలకు ఆమె పెట్టింది పేరు... కథానాయికగా సినిమాకి సైన్ చేయాల్సిన ఆమె.. అనుకోకుండా అంత చిన్నవయసులోనే గయ్యాళి అత్తగారి పాత్ర పోషించాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే.. ఆ తర్వాత మళ్లీ ఆమె అలాంటి పాత్రలకే కేరాఫ్ అడ్రసుగా మారిపోయింది. తెలుగింటి ప్రేక్షకులకు అసలు సిసలైన హాస్యాన్ని తన యాస ద్వారా, భాష ద్వారా అందించిన ఆమె చేసేవి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలైనా... తన మనసు మాత్రం మేలిమి బంగారమని ఆమెను ఎరిగిన వారందరూ చెబుతూనే ఉంటారు. సూర్యకాంతమంటే అప్పటి రోజుల్లో కుటుంబ కథా చిత్రాల్లో ఒక సూపర్ లేడీ.. ఒక ఫైర్ బ్రాండ్. ఆమె జయంతి సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటక్రిష్ణరాయపురంలో అక్టోబర్ 28, 1924 తేదీన అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా జన్మించింది సూర్యకాంతం. ఆరేళ్ళ వయసులోనే నాట్యం నేర్చుకుంది. తొలుత చంద్రలేఖ, ధర్మాంగద, నారద నారది లాంటి చిత్రాల్లో చిన్న చిన్న వేషాలలో కనిపించిన ఆమెకు హీరోయిన్ పాత్ర అందనే ద్రాక్షే అయ్యింది. సౌదామిని చిత్రంలో తొలుత ఈమెనే కథానాయికగా తీసుకోవాలని భావించారట నిర్మాతలు. కానీ, కారు ప్రమాదం వల్ల ఆమె ఆ అవకాశాన్ని కోల్పోయారు.

1950లో వచ్చిన "సంసారం" చిత్రంలో తొలిసారిగా అత్తగారి పాత్ర పోషించారు సూర్యకాంతం. ఆ తర్వాత వరుసగా ఆమెకు అలాంటి పాత్రలే వచ్చేవి. అయితే ప్రతీ పాత్రదీ ఓ వైవిధ్యమే. అందుకే మళ్ళీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తున్నా జనాలకు విసుగు పుట్టలేదు. ముఖ్యంగా ఆమె వాడే అచ్చ తెలుగు పదాలు, వాటి ఉచ్ఛారణ ప్రేక్షకులను కట్టిపడేసేవి. ఆమె వాచకాభినయం నభూతో నభవిష్యత్ అని చక్రపాణి లాంటి వారే మెచ్చుకున్నారు. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో తాడంకి శేషమాంబ అనే ఆవిడ గయ్యాళి అత్తగారి పాత్రలను పోషించేవారట. అయితే సూర్యకాంతం వచ్చాక, ఇక ఆ పాత్రలలో సూర్యకాంతాన్ని తప్ప మరొకరిని ఊహించుకొనే సాహసాన్ని చేయలేదు నిర్మాతలు. ఆమె నటనలో అంత ఈజ్ ఉండేది.

అయితే సూర్యకాంతం గయ్యాళితనమంతా తెరపైనే.. బయట ఆమె చాలా సాత్వికంగా ఉండేవారు. ఒక మంచి మనసున్న కన్నతల్లి మాదిరిగానే అందరినీ ఆదరించేవారు. షూటింగ్‌లకు గారెలు, బూరెలు, అరిసెలు వండి తీసుకొచ్చి ప్రొడక్షన్ వాళ్లకు పంచేవారట. వారు ఆప్యాయంగా ఆమెను "దొడ్డమ్మ గారూ" అని పిలిచేవారట. అలాగే తోటి ఆర్టిస్టులను కూడా ఇంటికి భోజనానికి పిలిచి, తన వంటలను కొసరి కొసరి వడ్డించేవారు సూర్యకాంతం. అందుకేనేమో తెరపై ఆమె పాత్రలోని ఘాటుదనాన్ని చూసిన ప్రేక్షకులు.. నిజజీవితంలో ఆమె తోటి వ్యక్తులపై చూపించే మమకారాన్ని చూసి నిజంగానే ఆశ్చర్యపోయేవారు. ఆమెతో కలిసి మాట్లాడిన పాత్రికేయులు ఈ విషయాలు పంచుకొనేవారట. 

ముఖ్యంగా నెగటివ్ షేడ్ పాత్రలు పోషిస్తున్నప్పుడు ఎలాంటి అసహజత్వాన్ని కనిపించనీయకుండా, కేవలం ముఖాభినయంతో ఆకట్టుకోవడం.. ఆ అభినయానికి మాట్లాడేటప్పుడు యాసను జతచేయడం సూర్యకాంతం ప్రత్యేకత. అలాంటి సూర్యకాంతానికి హిందీ చిత్రాలంటే ఎంతో ఇష్టం. అశోక్ కుమార్ ఆమె ఫేవరెట్ నటుడు. తను కూడా హిందీ చిత్రాలలో నటించాలనుకున్నారు. కానీ తెలుగు చిత్రసీమకు సుడి తిరగడం వల్లనేమో ఆమె ఇక్కడ గుర్తింపు పొందారు. గుమ్మడి వెంకటేశ్వరావు ఓసారి సూర్యకాంతంతో మాట్లాడుతూ "ఎంతపని చేశావు తల్లీ.. సూర్యకాంతం అనే మంచి పేరు పెట్టు్కొని... అదే పేరును తెలుగింటి ఆడపడుచులు పెట్టుకోకుండా చేశావు"అన్నారట. అంటే అప్పటికే సూర్యకాంతం అనే  పేరు గయ్యాళి అనే పదానికి పర్యాయపదంగా మారిపోయిందన్న మాట. 

ముఖ్యంగా సూర్యకాంతం కోసమే డైలాగ్ రైటర్లు చిత్రమైన సంభాషణలు రాసేవారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడే అనేక రేడియో నాటికల్లో కూడా నటించారు సూర్యకాంతం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, ఇంగ్లీష్ భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడేవారు. 

తోడికోడళ్లు, మాయాబజార్, ఆత్మబంధువు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, అందాల రాముడు, వెలుగు నీడలు మొదలైన సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. 

దాదాపు 750 చిత్రాల్లో నటించిన సూర్యకాంతానికి 1994లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డాక్టరేటు ప్రదానం చేసింది. అదే సంవత్సరం ఆమె అనారోగ్య కారణాల వల్ల పరమపదించారు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఆమె స్థానాన్ని భర్తీ చేసే మరో నటి పుట్టలేదన్న విషయం మాత్రం నిర్వివాదాంశమే. 

Trending News