Shaakuntalam Review: సమంత శాకుంతలం రివ్యూ.. విజువల్ ట్రీటే కానీ?

Samantha Shaakuntalam Review and Rating in Telugu: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజయింది, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 14, 2023, 02:04 PM IST
  • సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం
  • ప్రపంచ వ్యాప్తంగా మరికొద్ది గంటల్లో రిలీజ్
  • మీడియా స్పెషల్ ప్రీమియర్ రివ్యూ మీకోసం
Shaakuntalam Review: సమంత శాకుంతలం రివ్యూ.. విజువల్ ట్రీటే కానీ?

Samantha Shaakuntalam First Review in Telugu: సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా తర్వాత సమంత నటించిన సినిమా కావడం, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ  ఉండడంతో పాటు అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో శాకుంతలం మీద భారీ అంచనాల ఏర్పడ్డాయి. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించగా మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటికే కామన్ ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ ప్రీమియర్ వేసిన సినిమా యూనిట్ ఇప్పుడు మీడియా కోసం స్పెషల్ షో వేసింది. ఈ నేపద్యంలో ఒక్కోటి ఒక్కటిగా రివ్యూలు బయటకు వస్తున్నాయి. సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం

శాకుంతలం కథ:
శాకుంతలం కథ శకుంతల జననంతోనే మొదలవుతుంది. విశ్వామిత్రుని తపస్సు భంగం కలిగించేందుకు మేనకను ప్రయోగించిన ఇంద్రుడు వారిద్దరూ ప్రేమలో పడేలా చేస్తాడు. దీంతో వారి ప్రేమకు గుర్తుగా శకుంతల జన్మిస్తుంది. అయితే మేనక అప్సరస కావడం దేవలోకానికి వెళ్లాల్సి రావడంతో తనకు పుట్టిన సంతానాన్ని శకుంతల పక్షులకు అప్పగించి వెళుతుంది. ఆ పక్షుల సంరక్షణకు పెరుగుతున్న శకుంతలను కణ్వ మహర్షి(సచిన్ కెడ్కర్) చూసి ఆమెను దత్త పుత్రికగా స్వీకరిస్తాడు. కణ్వ ఆశ్రమంలోనే పెరిగిన శకుంతల(సమంత)ను మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు దుష్యంతుడు(దేవ్ మోహన్).

తర్వాత ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని శారీరకంగా ఒకటవుతారు. అయితే ఆమెను పట్టమనిషిగా హంగు ఆర్భాటాలతో తీసుకు వెళతానని చెప్పి ఆశ్రమం నుంచి రాజ్యానికి వెళ్లిన దుష్యంతుడు ఎంతకీ తిరిగి రాడు. చివరికి కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుని వద్దకు పంపితే దుర్వాసుడి శాప మహత్యంతో దుష్యంతుడు శకుంతలను ఎవరో తెలియదని అంటాడు. నిండు సభలో తీవ్ర అవమానం పొందిన శకుంతల అక్కడ నుంచి వెళ్ళిపోయి భరతుడి(అల్లు అర్హ)కి జన్మనిస్తుంది. ఆ తర్వాత శకుంతల, దుష్యంతులు ఎలా కలిశారు? దుర్వాసుడి శాప విముక్తి ఎలా జరిగింది? చివరికి ఏమవుతుంది అనేది ఈ సినిమా. 

ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.

విశ్లేషణ: 

ఇది కొత్తగా రాసుకున్న కథ కాదు, ఇప్పటికే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించాను అని ఇప్పటికే గుణశేఖర్ ప్రకటించారు. అయితే గుణశేఖర్ చేసిందేంటి అంటే దాన్ని ఇప్పటి తరం ఆడియన్స్ ముందుకు తీసుకురావడమే. కణ్వ మహర్షి ఆశ్రమం, హిమాలయాలు వంటి వాటిని అందంగా చూపించడంలోనే గుణశేఖర్ దృష్టి కేంద్రీకరించాడు. నిజానికి గుణశేఖర్ అంటేనే సెట్టింగ్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగా చేస్తారనే పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే అందరికీ తెలిసిన కథ అయినా ఈ కథాంశాన్ని ఎంచుకొని అందమైన లొకేషన్స్ మరింత అందంగా చూపించే ప్రయత్నం చేశాడు గుణశేఖర్.

పురాణం కాబట్టి మార్పులు చేర్పులకు పెద్దగా తావివ్వ లేదు. సినిమాటిక్ లిబర్టీ కోసం కాస్త డైలాగులు మార్చి రాసుకున్నారు తప్ప పెద్దగా అభిజ్ఞాన శాకుంతలాన్ని మార్చిన దాఖలాలు అయితే లేవు. అయితే ఈ సినిమా ఆద్యంతం పురాణ కథ కావడంతో నేటి జనరేషన్ కు కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే. అలాగే సంభాషణలు కూడా పూర్తిస్థాయిలో గ్రాంథిక భాషలో ఉండడంతో పౌరాణిక సినిమా చూస్తున్నాం అనే భావన కలుగుతుంది. మైథాలజికల్ సబ్జెక్టు అని చెబుతున్నా పూర్తి స్థాయిలో ప్రేక్షకులు లీనమయ్యే పరిస్థితులు కనిపించలేదు.

అయితే త్రీడి ఎఫెక్ట్స్ మాత్రం సినిమాకి అదనపు హక్కు హంగులు జోడించాయి. అద్భుతమైన విజువల్స్ అనలేం కానీ త్రీడీలో మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులను మైమరిపించే విధంగా ఉన్నాయి. మొదటి భాగం అంతా శకుంతల జననం శకుంతలతో దుష్యంతుడు ప్రేమలో పడటం వంటి అంశాలను చూపించగా అవి లాగ్ అనిపించాయి.  ఇక రెండో భాగంలో దుష్యంతుడికి శకుంతలకీ పెరిగిన దూరం, వారిద్దరినీ కలిపేందుకు జరిగిన పరిణామాలు వంటి వాటిని కొంచెం గ్రిప్పింగ్ గా చూపించారు. మధ్యలో కథలో భాగంగానే దేవతలు- రాక్షసుల యుద్ధం రాక్షస సేనను దుష్యంతుడు మట్టికరిపించే సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే విషయం చూసిన వెంటనే ప్రేక్షకులకు అర్థమవుతుంది, భారీ బడ్జెట్ అని ఊదరగొట్టడంతో ఇంకా క్వాలిటీ ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. 

నటినటులు
ఇక నటినటుల విషయానికి వస్తే సమంత శకుంతల పాత్రలో పూర్తిస్థాయిలో జీవించింది. అయితే సొంత డబ్బింగ్ కావడంతో కొంచెం ఎబెట్టుగా అనిపిస్తుంది. గతంలో చిన్మయి ఆమెకు డబ్బింగ్ చెప్పేది, ఆమె గొంతుకు అలవాటైపోయి సమంత సొంత గొంతు కూడా కాస్త ఎబెట్టు అనిపిస్తుంది. ఇక దుష్యంతుడుగా  దేవ్ మోహన్ తనదైన శైలిలో నటించాడు, సూట్ అయ్యాడు కానీ ఎవరైనా తెలుగు హీరోను ఈ రోల్ కోసం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అల్లు అర్హ కనిపంచింది చివరి పావు గంటే అయినా ఆమెను చూడగానే సినిమా మొత్తానికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక మిగిలిన పాత్రలు పోషించిన సచిన్ కేడ్కర్, ప్రకాష్ రాజ్, గౌతమి, అనన్య, నాగళ్ళ శివ బాలాజీ వంటి వారు తమదైన శైలిలో నటించి తమ పాత్రల పరిధి మీద ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకుడిగా గుణశేఖర్ తనదైన మార్కు వేసుకునే ప్రయత్నం చేశాడు. చాలా వరకు అందులో సఫలీకృతం అయ్యాడు. అయితే ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ నేటి తరానికి ఎంతవరకు కనెక్ట్ అవుతుందనే అంశం ఆధారంగా ఈ సినిమా భవితవ్యం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ మార్క్ ఎక్కడా తప్పినట్లు అనిపించలేదు. ఇక సాయి మాధవ్ బుర్ర అందించిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. మణిశర్మ పాటలు మైమరిపించే స్టైల్లో సాగాయి.

అయితే పూర్తిస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి అదనపు ఆకర్షణ అని చెప్పక తప్పదు, సినిమాకి ప్రధాన బలం కూడా. ఇక 3డీ, విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అవలేదు. సినిమాటోగ్రాఫర్ శేఖర్ జోసెఫ్ పనితనం సినిమా ఆద్యంతం కనిపించింది. ఎడిటింగ్ టేబుల్ మీద కూడా పూర్తిస్థాయిలో టీమంతా దృష్టి పెట్టినట్లు అనిపించింది. ఇక నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగినట్లుగానే ఉన్నాయి.

ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే
సమంత శాకుంతలం ‘విజువల్ ట్రీట్’..కానీ అందరికీ కాదు!

Rating:2.25/5

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News