భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు దర్శకుడు శంకర్. శంకర్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడంటే అది అంత ఆషామాషీగా ఉండదనే సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఓ సినిమాకు కథ రాసుకోవడం మొదలుపెడితే, ఆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు అతడు పడే తపన, చూపించే కసి, తీసుకునే శ్రద్ధ ఏవీ మామూలుగా ఉండవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాను ఓ యజ్ఞంగా భావించి తెరకెక్కించే శంకర్ తాను ఏ సినిమా తీసినా అందుకోసం ముందస్తుగానే ఓ భారీ అధ్యయనాన్ని చేపడతాడు. అందుకే 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీని షేక్ చేసిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ని ప్లాన్ చేస్తోన్న శంకర్.. ప్రస్తుతం అందుకు అవసరమైన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. ఓవైపు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న 2.0 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూస్తూనే మరోవైపు.. భారతీయుడు 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మేనేజ్ చేసుకుంటున్నాడు.
ఇక అసలు విషయానికొస్తే, భారతీయుడు 2 సినిమా కోసం దర్శకుడు మన రాయలసీమపై కన్నేశాడని తెలుస్తోంది. భారతీయుడు 2 సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ప్లాన్ చేస్తోన్న శంకర్ అందుకు రాయలసీమలో అనువైన స్థలాన్ని ఎంపిక చేసేపనిలో పడ్డాడు. గతంలో ఈపనిపైనే ఓసారి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్‌తో కలిసి కడప జిల్లా గగనతలంపై హెలీక్యాప్టర్‌లో విహంగవీక్షణం చేసినట్టు ఓ టాక్ వినిపించింది. కడప జిల్లాలోని ఓ పల్లెటూరిలో దిగి స్థల పరిశీలన చేసినట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో శంకర్, రవి వర్మన్ హెలీక్యాప్టర్‌లో చక్కర్లు కొడుతున్నట్టుగా ఉన్న ఓ ఫోటో సైతం ఇంటర్నెట్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ఆ పనిపై సీరియస్‌గా దృష్టిసారించాడట శంకర్.
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని విషయాలు పూర్తిగా తెలియాలంటే డిసెంబర్ వరకు వేచిచూడక తప్పదు.