అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఒక అడుగు ముందుకేసి, అవసరమైతే హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని వ్యాఖ్యానించడం హర్షించదగిన విషయం అని వైఎస్ జగన్ అభప్రాయపడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో పోరాడి గెలిచిన కేసీఆర్ గత ఐదేళ్లలో చంద్రబాబు చేసినట్టుగా కాంగ్రెస్, బీజేపీలతో ఏనాడూ సంసారం చేయలేదని, అంతేకాకుండా తనదైన పాలనతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారని జగన్ వ్యాఖ్యానించారు.
ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన ఓ విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 'నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని, తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కేటీఆర్కు చంద్రబాబు ప్రతిపాదించారని, అయితే చంద్రబాబు సంగతి తెలిసిన టీఆర్ఎస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను పక్కకుపెట్టింది' అని చంద్రబాబుని ఎద్దేవా చేశారు.