Undavalli Key Comments: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది. ఈ విషయంపై తెలుగుదేశం వర్గాలు తనపై ముప్పేట దాడి చేయడాన్ని ఉండవల్లి తీవ్రంగా ఖండించారు.
ఏపీ స్కిల్ కేసులో సీబీఐ విచారణ కోరితే తెలుగుదేశంకు ఎందుకు కోపమొస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాల్సిందేనన్నారు. తామేం తప్పు చేయలేదని అంత కచ్చితంగా చెబుతున్నప్పుడు సీబీఐ విచారణ అంటే ఆగ్రహం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే స్కిల్ స్కాం జరిగినట్టుగా జీఎస్టీ డీజీ తేల్చారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
స్కిల్ స్కాంపై ప్రసుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ కేసు బయటపడిందే పూణే జీస్టీ అధికారుల విచారణతోనని అందుకే సీబీఐ దర్యాప్తు అడుగుతున్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఇక సీమెన్స్ కంపెనీ ఈ ప్రాజెక్టుతో సంబంధమే లేదని చెప్పడమే కాకుండా ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని చెబుతోంది. అప్పుడే పూణే జీఎస్టీ విభాగం అధికారులు చంద్రబాబుకు లేఖ రాస్తే ఎందుకు పట్టించుకోలేదని ఉండవల్లి నిలదీశారు. బెయిల్ ఇవ్వలేదనే కారణంతో న్యాయమూర్తిపై దుర్బాషలకు దిగారని ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. తప్పు చేయకుంటే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి ఎందుకు పారిపోయారో చెప్పాలన్నారు.
స్కిల్ కేసులో వాస్తవాలు కచ్చితంగా బయటకు రావల్సిన అవసరముందని స్పష్టం చేశారు. స్కిల్ కేసులో ఉన్నవన్నీ సూట్ కేసు కంపెనీలైనప్పుడు విచారణ జరగాల్సిందేనన్నారు. చంద్రబాబుకు తెలియకుండా స్కాం జరిగిందంటే ఎవరూ నమ్మరని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చాలా సౌకర్యాలున్నాయని, లైబ్రరీ కూడా ఉందన్నారు. అంతగా అవసరమైతే సౌకర్యాల కోసం కోర్టుని సంప్రదించవచ్చని చెప్పారు.
మరోవైపు చంద్రబాబు కేసులో కీలకంగా మారిన సెక్షన్ 17 ఏ గురించి మాట్లాడారు. చంద్రబాబుకు సెక్షన్ 17 ఏ వర్తిస్తే అప్పుడు జగన్‌కు కూడా వర్తిస్తుందని గుర్తు చేశారు. జగన్‌కు వర్తిస్తే ఇక అతనిపై కేసులే ఉండవన్నారు. గతంలో తాను పోలవరం, పట్టిసీమ విషయంలో కూడా హైకోర్టును ఆశ్రయించానన్నారు. సీబీఐ విచారణ కోరడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Undavalli Key Comments: సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తే, జగన్‌కూ వర్తించాలి కదా