దేశంలోని 32 ప్రాంతీయ పార్టీలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.321.03కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించింది. అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతీయ పార్టీల్లో దేశవ్యాప్తంగా సమాజ్ వాదీ పార్టీ రూ.82.76 కోట్లతో ఆగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో టీడీపీ రూ.72.92 కోట్లతో ఉంది.
ఫీజులు, సభ్యత్వాలు, స్వచ్ఛంద విరాళాలు, భారతదేశంలో షెడ్యూల్డ్ బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీరేట్లు, ఐటీ రిఫండ్లు టీడీపీ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. అన్ని ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే అత్యధికంగా టీడీపీకి రూ.60.75 కోట్లు ఫీజు, చందాల రూపంలో సమకూరాయి. ఇది మొత్తం ఆదాయంలో 83.31 శాతం. టీడీపీ ఏడాది మొత్తం ఆదాయంలో కేవలం 33 శాతం మాత్రమే ఖర్చు చేసిందని నివేదిక తెలిపింది.
కాగా ఈ జాబితాలో ఆదాయం తక్కువగా నమోదవుతున్న పార్టీలుగా టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీలు నిలిచాయి. గత రెండు సంవత్సరాలలో టిఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ ఆదాయాలు పడిపోయాయి. టీఆర్ఎస్ ఆదాయం 2015-16లో రూ.8.908 కోట్ల నుంచి 2016-17లో రూ.3.79 కోట్లకు పడిపోయింది. వైఎస్ఆర్సీపీ ఆదాయం 1.91 కోట్ల నుంచి 0.94 కోట్లకు తగ్గింది. సభ్యత్వ రుసుములు, విరాళాలు, ఎఫ్డీ వడ్డీ, బ్యాంకు వడ్డీ, ఐటీ రిఫండ్‌పై వడ్డీ మొదలైనవి టీఆర్ఎస్ ఆదాయ వనరులు. వైఎస్ఆర్సీపీది ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ అని తెలిపింది.
తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో మొత్తం ప్రాంతీయ పార్టీలలో టీడీపీ, ఎఐఎంఐఎంల ఆదాయం పెరిగిందని.. ఎఐఎంఐఎం రూ.7.42 కోట్లు ఆదాయం ప్రకటించగా.. అందులో రూ.50 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపింది.