జన చైతన్య పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటనలో ఉన్న సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అక్కడ ఎన్డీ ఫంక్షన్ హాలు వేదికగా చేసిన పలు వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనియాంశమయ్యాయి. ఎన్డీ ఫంక్షన్ హాలులో పవన్ కల్యాణ్‌ని కలిసిన జనసేన పార్టీ కార్యకర్తలు.. ''సైలెన్సర్ లేని బైకులతో శబ్ధం చేస్తున్నారు'' అని పోలీసులు తమను వేధిస్తున్నట్టుగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలను ఉద్దేశించి వేదికపైనుంచి మాట్లాడిన పవన్ కల్యాణ్... '' జన సైనికులు సైలెన్సర్ తీసి శబ్ధం చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్టు చూస్తున్నారు... మరి ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్న వాళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు'' అని అన్నారు.
అయితే, సరిగ్గా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనియాంశమయ్యాయి. ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోన్న పవన్ కల్యాణ్.. తాజాగా తుపాకీ కాల్పుల ప్రస్తావన తీసుకురావడానికి వెనుకున్న కారణం బాలయ్య బాబు ఘటనేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2004లో బాలకృష్ణ తన నివాసంలోనే నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులకు జరిపినట్టుగా వచ్చిన వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అందుకే తాజాగా పవన్ కల్యాణ్ ఆనాటి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ బాలయ్య బాబుని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా అనే సందేహాలు తలెత్తున్నాయి.