ప.గో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ప్రజాకర్షణ పథకాన్ని ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే సబ్సిడీపై బ్యాటరీ ఆటోలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరులోని క్రాంతి కల్యాణ మంటపంలో ఆటో డ్రైవర్ల సంఘాలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్లలో ఒకడు లీడర్ అవుతాడు
ఈ సందర్భంగా ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఎన్నికల సమయంలో వాడుకోవడం తప్పితే.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లలో ఒకరు నాయకుడిగా ఎదిగితే నే వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. ఆ దిశగా ఎదగాలని తాను ఆకాక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆటోకార్మికుల సమస్యలను పార్టీ ఎజెండాగా తీసుకొని ఎన్నికల బరిలోకి దిగుతామని.. ఆ దిశగా పార్టీని ముందుకు నడిపిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
పోట్లాట వ్యక్తులపై వద్దు.. వ్యవస్థపై చేద్దాం
ఆటోడ్రైవర్లు తమ సమస్య పరిష్కారం కోసం అధికారులపై పోట్లాట వద్దని.. వారిని శాసించే వ్యవస్థపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పోలీసులు, ట్రాన్స్ పోర్టు అధికారులతో సామరస్యంగా ఉండాలని.. గొడవలు పడొద్దని పవన్ సూచించారు. ఆటో డ్రైవర్ల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందనని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్సీడీపై ఆటోలు అందిస్తామని పవన్ ప్రకటన చేశారు.