LPG prices, Petrol Prices, Power Bills: గ్యాస్ ముట్టుకుంటేనే పేలిపోతోంది. అగ్గి లేకుండానే పెట్రోల్ మండుతోంది. కేవలం స్విచ్ వేస్తేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇక, ఆర్టీసీ కూడా ఇటీవలే సైలెంట్‌గా ఝలక్ ఇచ్చింది. మొత్తానికి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. బిల్లులేమో బెంబేలెత్తిస్తున్నాయి. జేబులు ఖాళీ చేసేస్తున్నాయి. చార్జీల మోత మోగిస్తుంటే.. ధరలు వాత పెడుతున్నాయి. జనం పరిస్థితి దయనీయంగా మారింది. ఎటు చూసినా, ఎక్కడికెళ్లినా మోతలు, వాతలు వెంటాడుతున్నాయి. ధరలు, చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. సగటు వేతన జీవికి భారంగా పరిణమిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా ఈ మోతలు, వాతలు తప్పడం లేదు. విపక్షాలు షరామామూలుగానే అధికార పక్షాలపై నిప్పులు కురిపిస్తున్నాయి. నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. కానీ, ప్రభుత్వాలు మాత్రం తమ దారిలో తాము దూసుకుపోతూనే ఉన్నాయి.
కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. నిత్యం చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ సగటున రూపాయి చొప్పున పెరుగుతున్నాయి. గడిచిన పదిరోజుల్లో తొమ్మిదిసార్లు చార్జీలు పెరిగాయి. ఏడు రూపాయల మేర పైకి ఎగబాకాయి. హైదరాబాద్‌లో 115 రూపాయల మార్క్ దాటిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయల 56 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర 101 రూపాయల 56 పైసలకు చేరింది.
ఇక, వంటింట్లో అతి ముఖ్యమైన గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయల మార్క్ దాటింది. ఇటీవలే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచాయి ఇంధన సంస్థలు. ఒక్కో సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో, హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర ఒక వెయ్యి రెండు రూపాయలకు చేరింది. డెలివరీ చార్జీల పేరుతో తీసుకునే ౩౦ రూపాయలు కలుపుకుంటే ధర ఒక వెయ్యి 32 రూపాయలు అయ్యింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కరెంటు చార్జీల మోత మోగింది. పది రోజుల క్రితం తెలంగాణలో కరెంటు చార్జీలు భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం ఏపీలోనూ విద్యుత్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కారు కరెంటు చార్జీల పేరిట 5వేల 596 కోట్ల రూపాయల భారం మోపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తున్నాయి. డొమెస్టిక్ కేటగిరీలో ఒక్కో యూనిట్‌కు 50 పైసలు, మిగతా కేటగిరీలకు యూనిట్‌కు రూపాయి చొప్పున బిల్లులు పెంచారు. అంతేకాదు.. ఫిక్స్‌డ్ చార్జీల కింద రూ.10 కొత్తగా వేయనున్నారు. వీటితోపాటు.. కస్టమర్ చార్జీలు కూడా భారీగా పెంచారు. అటు.. ఏపీలోనూ కరెంటు చార్జీలు భారీగా పెంచేశారు. డిస్కమ్‌ల ప్రతిపాదనల మేరకు ఏపీఈఆర్సీ విద్యుత్ చార్జీలు పెంచింది. ఇవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఒక్కో యూనిట్‌కు కనిష్టంగా 45 పైసల నుంచి గరిష్టంగా ఒక రూపాయి 57 పైసల దాకా అదనంగా పెరిగాయి. అయితే, వినియోగించే యూనిట్లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికీ చార్జీలు పెంచేశారు. అయితే, టెలిస్కోపిక్ విధానంలో చార్జీలు పెంచడం మాత్రం కాస్త ఊరటను కలిగిస్తోంది.
మరోవైపు.. తెలంగాణలో ఇంట్లోంచి బయటకు వెళ్లి బస్సెక్కాలంటే వణుకు పుడుతోంది. ముందస్తు ప్రచారం, ప్రకటన లేకుండా తెలంగాణ ఆర్టీసీ (TSRTC bus fares hiked) గుట్టు చప్పుడు కాకుండా చార్జీలను పెంచేసింది. వారం రోజుల్లోనే రెండు దశలుగా పెంచిన చార్జీలతో సామాన్యుడి నడ్డి విరిగే పరిస్థితి నెలకొంది. తొలుత రౌండ్‌ఫిగర్ పేరుతో టికెట్‌పై ఒక రూపాయి నుంచి మూడు రూపాయల దాకా పెంచింది. ఆ తర్వాత సేఫ్టీ సెస్ పేరిట చార్జీలు పెంచింది. అంతేకాదు.. లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల టికెట్ రేట్లను కూడా 10 నుంచి 20 రూపాయల దాకా పెంచారు. ఫలితంగా బస్సుపాసుల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ తీరుగా పెరుగుతున్న ధరల పెంపుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నాయి. కానీ, ప్రభుత్వాలు మాత్రం సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. సామాన్యులు మాత్రం తమ పరిస్థితి ఎప్పుడు మెరుగు పడుతుందా అని ఎదురుచూపులు చూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook