చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు: కేటీఆర్

      

Last Updated : Nov 24, 2018, 05:10 PM IST
చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు: కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) హైదరాబాద్‌లోని సీమాంధ్రుల సంఘీభావ సభలో పాల్గొని మాట్లాడారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవని.. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్రులు కూడా హైదరాబాదీలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే సీమాంధ్రులను తరిమేస్తారని కొందరు అసత్యప్రచారం చేశారని.. కానీ ఆ సీమాంధ్రులే తమను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు పోటీ ఇస్తుందని.. గతంతో పోలిస్తే ఇప్పడు హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర విభజన అంటే కేవలం ప్రాంతాల విభజన మాత్రమేనని.. మనుషుల విభజన కాదని కేటీఆర్ అన్నారు. తమ పార్టీని తెలంగాణలో నివసించే సీమాంధ్రులు కూడా అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి ఒక ప్రాతిపదిక అనేది లేదని... డిసెంబరు 11 తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీణ వాయించుకుంటారని.. చంద్రబాబు కూడా ఫిడేల్ వాయిస్తారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు పై కూడా కేటీఆర్ సెటైర్లు విసిరారు. గ్రాఫిక్స్ మాయాజాలం చేయడం చంద్రబాబుకి బాగా తెలుసని.. అమరావతిని కూడా గ్రాఫిక్స్ ద్వారా కట్టాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. 9 ఏళ్లలో హైదరాబాదుని నిర్మించామని చెబుతున్న చంద్రబాబు.. అయిదేళ్లలో అమరావతిలో ఏం చేయలేకపోవడానికి కారణం ఆయన అక్కడి ప్రజలకు వివరించగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గొప్ప మాటలు చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని.. కానీ ఆచరణ విషయానికి వస్తే ఆయన ప్రజలకు ఏం చేశారో అందరికీ తెలుసని కేటీఆర్ అన్నారు. 

Trending News