CM Jagan Mohan Reddy Birthday: సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని నగరాల్లో ఫ్లెక్సీలతో ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక విశ్వ విద్యాలయాల్లోనూ సీఎం జగన్ బర్త్ డే ఫ్లెక్సీలు వెలిశాయి. విద్యార్థి సంఘాల నాయకులు సీఎం జగన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓ రిక్వెస్ట్ చేశారు.
విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని.. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చి వేసి, ఆ పార్టీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో ప్రాంగణాలు నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందని సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు, చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన అన్నారు.
'తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవి..? డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సీఆర్ రెడ్డి లాంటి గొప్పవారు ఉప కులపతులుగా బాధ్యతలు నిర్వర్తించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆ విద్యావనం నుంచి ఎందరో మేధావులు వచ్చారు. అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్ళు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలి. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోంది.
విశ్వ విద్యాలయ ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలని మనవి చేస్తున్నాం. విద్యార్థులను, చిరుద్యోగులను ఒత్తిడి చేసి వేడుకలు చేయించడం... బలవంతపు పార్టీ మార్పిళ్లకు పాల్పడటం విడిచిపెట్టాలి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి. విశ్వ విద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం ఉప కులపతులు బాధ్యతగా పని చేయాలి..' అని పవన్ కళ్యాణ్ కోరారు.
Also Read: Coronavirus Zombie Infection: జాంబీ ఇన్ఫెక్షన్ హెచ్చరిక.. కరోనా మృతదేహాలను తాకితే ఏమవుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook