దేవస్థానం చరిత్రలో తొలిసారి: 6 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేత

పాలక మండలి సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jul 15, 2018, 10:48 AM IST
దేవస్థానం చరిత్రలో తొలిసారి: 6 రోజుల పాటు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేత

పాలక మండలి సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఆరు రోజులపాటు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యాక్రమం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ శనివారం తెలిపారు.

శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 16వ తేది వరకు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.  మహా సంప్రోక్షణ జరిగే రోజుల్లో వైదిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో 6 రోజులపాటు స్వామివారి దర్శనాలను పూర్తిగా నిలిపివేశామని ఆయన తెలిపారు.

మహాసంప్రోక్షణ నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి భక్తులను క్యూలైన్లు, వైకుంఠం కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించబోమన్నారు. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్న వారికే 10వ తేదీన శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరిగి ఆగస్టు 17వ తేది ఉదయం 6 గంటల నుంచి భక్తులకు పునఃదర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమల యాత్రను రూపొందించుకోవాలని చైర్మన్‌ మీడియా ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేశారు.

కాగా.. 12 ఏళ్ల క్రితం.. 2006లో జరిగిన మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను స్వామివారి దర్శనానికి పరిమిత సంఖ్యలో అనుమతించారు. అప్పట్లో తిరుమలకు వచ్చేవారి సంఖ్య రోజూ 40 వేల నుంచి 50 వేల మంది ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 70 వేలు దాటింది. దీంతో భక్తులపై పరిమితి విధిస్తే సమస్యలు రావొచ్చనే కారణంగా టీటీడీ దర్శనాలను నిలిపివేసింది.

Trending News