ఆంధ్రప్రదేశ్ గన్నవరం నుండి తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ ఈ నెల 25వ తేదిన ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇండిగో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రతీ మంగళవారం, గురువారం గన్నవరం నుండి సింగపూర్ విమాన సర్వీసు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ తొలి సర్వీస్‌కు టిక్కెట్లను విక్రయించే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఈ రోజే ఇండిగో సంస్థ ఆన్ లైనులో టిక్కెట్ల విక్రయానికి చెందిన ప్రకటన చేయవచ్చని అధికారులు అంటున్నారు. 180 సీట్ల బోయింగ్ విమానం గన్నవరం నుండి సింగపూర్‌కి తొలిసారిగా సర్వీస్ అందివ్వడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల జీతభత్యాలకు సంబంధించిన సమస్య తలెత్తగా.. కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ పోర్టు అథారిటీస్ ఆఫ్ ఇండియా వారి జోక్యంతో ఆ సమస్య సమసిపోయింది.
ప్రస్తుతం అందిస్తున్న సర్వీసుకు సంబంధించి కొంత ఫండింగ్ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం కూడా భరిస్తోంది. ఎయిర్ బస్ ఏ 320 విమానం ద్వారా సేవలందించే ఈ సర్వీసులో ప్రయాణ సమయం నాలుగు నుండి ఆరు గంటల వరకు ఉంటుంది. ఈ అవకాశాన్ని ఏపీ ప్రజలు ఉపయోగించుకోవాలని.. సింగపూర్ వెళ్లాలంటే గతంలో చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్లి విమానం మారేవారని... కానీ తొలిసారిగా గన్నవరం నుండి ఆ సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు.
గత సంవత్సరం మే నెలలో విజయవాడ ఎయిర్ పోర్టుకి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయ స్టేటస్‌ను మంజూరు చేసింది. స్వదేశీ, విదేశీ పర్యాటక రంగ అభివృద్ది కోసం ఈ విమానాశ్రయానికి మరింత ఫండింగ్ అందివ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా భావించాయి. అందులో భాగంగానే గన్నవరం ఎయిర్ పోర్టులో సాంకేతిక హంగులతో టెర్మినల్ భవనం నిర్మించడానికి దాదాపు రూ.135 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అదే సమయంలో గన్నవరం విమానాశ్రయానికి అమరావతి ఎయిర్ పోర్టు అని పేరు మార్చాలని లేదా ఎన్టీఆర్ అమరావతి ఎయిర్ పోర్టుగా పేరు మార్చాలని పలువురు డిమాండ్ చేశారు.