ఆ రెండూ తప్ప.. ఏపీకి ఇవ్వాల్సింది ఇంకేముందని షాకిచ్చిన అరుణ్ జైట్లీ!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కేంద్రం అభిప్రాయాన్ని ఖరాఖండిగా తేల్చిచెప్పారు

Last Updated : Feb 8, 2018, 09:31 PM IST
ఆ రెండూ తప్ప.. ఏపీకి ఇవ్వాల్సింది ఇంకేముందని షాకిచ్చిన అరుణ్ జైట్లీ!

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కి ఏమీ దక్కలేదు అని కేంద్రం వద్ద మొరపెట్టుకుంటోన్న ఏపీ నేతల నెత్తిన పిడుగుపడేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కేంద్రం అభిప్రాయాన్ని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా నష్టం జరిగిందని భావించాం కనుకే  రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించామని స్పష్టంచేసిన అరుణ్ జైట్లీ.. ఆ స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాల్సి వుండటంతోపాటు రెవిన్యూ లోటును పూడ్చాల్సిన హామీ మాత్రమే మిగిలిపోయాయని అన్నారు. ఈ రెండు హామీలు తప్పించి ఇప్పటికే కేంద్రం ఏపీకి ఎంతో ఆర్థిక సహాయం చేస్తూ వస్తోందని  చెప్పే క్రమంలో.. కేంద్రం ఏపీకి చేసిన సహాయం జాబితాను సభలోనే ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న విమర్శలకు గురువారం సాయంత్రం సభలో సమాధానం ఇచ్చే క్రమంలో ఏపీ నేతల నిరసనపై కూడా స్పందిస్తూ అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

'కేంద్రం ఇస్తామన్న ప్యాకేజీలో ఇప్పటికే ఎన్నో అమలు చేశాం. ఇంకా కొన్ని ప్రస్తుతం అమలయ్యే దశలో ఉన్నాయి. ఏపీకి అనేక విద్యాసంస్థలను మంజూరు చేశాం. ఇంకా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా వుంది. ఏపీ ఇబ్బందుల్లో వుందనే సానుభూతి కేంద్రానికి కూడా వుంది' అని ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. అయితే, అరుణ్ జైట్లీ సమాధానంతో సంతృప్తి చెందని ఏపీకి చెందిన ఎంపీలు సభలోనే నిరసన తెలిపారు. దీంతో ఈ గందరగోళం మధ్యలోనే సభ రేపటికి వాయిదా పడింది. తాజాగా అరుణ్ జైట్లీ చెప్పిన సమాధానాన్ని నిశితంగా పరిశీలిస్తే, కేంద్రం నుంచి కొత్తగా ఇంకేదో రాబట్టడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది అంటున్నారు ఏపీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధులు. 

Trending News