AP Bjp Chief : 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ మిత్రపక్షం. ఆంధ్రప్రదేశ్ లో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీకి చోటు దక్కింది. ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు టీడీపీకి దక్కాయి. రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కింది. 2018 వచ్చే సరికి సీన్ మారింది. బీజేపీతో విభేదించారు చంద్రబాబు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటికి వచ్చింది. రాష్ట్రంలోనూ సేమ్ సీన్. బీజేపీతో విభేదించడమే కాదు ఓ రకంగా యుద్ధమే చేశారు చంద్రబాబు. ప్రత్యేక హోదా నినాదంతో మోడీ ప్రభుత్వంపై ఉద్యమించారు. ప్రధాని మోడీ, అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీని ఏకంగా ఉగ్రవాది అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షాను అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిశారు చంద్రబాబు. ఢిల్లీలో సభలు నిర్వహించారు. బీజేపీని ఓడిస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు బాబుకు షాకిచ్చాయి. ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లపై పరిమితమైంది. ముగ్గురు టీడీపీ ఎంపీలు మాత్రమే గెలిచారు. తమను విభేదించిన చంద్రబాబును ఓడించేందుకు వైసీపీకి బీజేపీ సహకరించిందనే ప్రచారం జరిగింది. బీజేపీ కార్యకర్తలు కూడా చంద్రబాబుపై కసితో వైసీపీకి ఓట్లేశారని చెబుతారు. చంద్రబాబును ఇంటికి పంపేందుకు వైసీపీకి బీజేపీ ఆర్థిక సాయం కూడా చేసిందనే వాదనలు ఉన్నాయి. 2019లో బీజేపీని అంతగా వ్యతిరేకించిన చంద్రబాబు.. ఓటమి తర్వాత మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం చంద్రబాబు విషయంలో ఇంకా కోపంగానే ఉన్నారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబును కాదని జగన్ కే బీజేపీ పెద్దల అశీస్సులు ఉన్నాయని సమాచారం. ఏపీలో 2014 తరహాలో టీడీపీ,బీజేపీ,జనసేన పొత్తు ఉంటే బాగుటుందని పవన్ కల్యాణ్ చెబుతున్నా బీజేపీ స్పందించడం లేదు. జనసేనతో ఓకే గాని టీడీపీతో పొత్తు ఉండదని చెబుతోంది. చంద్రబాబు విషయంలో బీజేపీ పెద్దలు ఇంకా సీరియస్ గా ఉండటమే దీనికి కారణమని అంటున్నారు.
ఏపీకి సంబంధించి మరో అంశం తాజాగా తెరపైకి వస్తోంది. టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడమే కాదు.. ఏపీలో టీడీపీ టార్గెట్ గానే బీజేపీ రాజకీయం చేయబోతుందని తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రస్తుతం సోము వీర్రాజు ఉన్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ పగ్గాలను ఎన్టీఆర్ కూతురికి ఇవ్వాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు. ఆమెకు ఢిల్లీ నేతల ఆశీస్సులు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన పురంధేశ్వరి.. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో పని చేశారు. మంచి వక్తగా గుర్తింపు పొందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ బాధ్యతలు అప్పగిస్తే చాలా రాజకీయ లాభాలు కలుగుతాయని ఢిల్లీ పెద్దల అంచనా.
పురంధేశ్వరి ఎంపిక పూర్తిగా చంద్రబాబు టార్గెట్ గానే జరుగుతుందనే టాక్ వస్తోంది. పురంధేశ్వరి ఏపీలో బలమైన సామాదిక వర్గానికి చెందినవారు. ఆ సామాజిక వర్గమే టీడీపీకి బలం. పురంధేశ్వరికి తండ్రి ఎన్టీఆర్ గ్లామర్ ఉండనే ఉంటుంది. దీంతో పురంధేశ్వరికి పగ్గాలిస్తే ఎన్టీఆర్ అభిమానులతో పాటు టీడీపీకి బలంగా ఉన్న ఆ సామాజికవర్గం మద్దతు బీజేపీకి వస్తుందనే లెక్కల్లో కమలం నేతలు ఉన్నారు. ఇది చంద్రబాబుకు తీరని నష్టం. బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేన చీఫ్ మరో బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. ఇలా పవన్ తో కాపు సామాజిక వర్గం.. దగ్గుబాటితో కమ్మ సామాజిక వర్గాలను ఆకర్షించి... ఏపీలో పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడగా భావిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు ఆట కట్టిస్తే.. తమ రాజకీయ భవిష్యత్ కు డోకా ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచిపెద్ద ఎత్తున వలసలు బీజేపీలోకి ఉంటాయని భావిస్తున్నారు. 2024 కాకుండా 2029 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది. ముందు టీడీపీని ఫినిష్ చేసి.. ఆ ప్లేస్ ను ఆక్రమించి.. తర్వాత వైసీపీని టార్గెట్ చేయడమే ఏపీపై బీజేపీ హైకమాండ్ ప్లాన్ గా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.