ఏపీ భవితవ్యానికి 15 రోజుల పరీక్షా ?

15 రోజుల్లో ఏపీ భవితవ్యం తేలిపోనుందా ?

Last Updated : Feb 10, 2018, 06:08 PM IST
ఏపీ భవితవ్యానికి 15 రోజుల పరీక్షా ?

కేంద్ర బడ్జెట్ పట్ల తీవ్ర అసంతృప్తితో వున్న ఆంధ్రప్రదేశ్‌ని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్న మిత్రపక్షాన్ని సంతృప్తి పర్చేందుకు ఏమైనా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఏపీకి బాకీ వున్న మిగులు నిధుల విడుదల, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై రానున్న 15 రోజుల్లో ఓ యాక్షన్ ప్లాన్ రచించనున్నట్టు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి స్పష్టమైన హామీ లభించిందని తెలుస్తుండటమే అందుకు కారణం. తనని కలిసిన కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈమేరకు ది హన్స్ ఇండియా ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ఇద్దరు కేంద్ర మంత్రుల భేటీలో రైల్వే జోన్ ఏర్పాటు, రెవిన్యూ లోటు, ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ లాంటి అంశాలు చర్చకు వచ్చాయని ఆ కథనం పేర్కొంది. అంతేకాకుండా మార్చిలో మళ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి కేంద్రం ముందు ఏపీ పెట్టిన అన్ని డిమాండ్లను కేంద్రం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నట్టుగా టీడీపీకి చెందిన మరో ఎంపీ తోట నర్సింహం చెప్పినట్టు సమాచారం. నిన్న సాయంత్రం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ సైతం మీడియాతో మాట్లాడుతూ ఇంచుమించు ఇటువంటి ప్రకటనే చేశారు. 

ఇదిలావుంటే, ఒకవేళ 15 రోజుల తర్వాత కూడా కేంద్రం నుంచి ఎటువంటి కదలిక కనిపించకపోతే, ఈ ఎన్డీఏ సర్కార్ నుంచి ఈ హయాంలో ఇక ఏమీ ఆశించడానికి వీలు లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

Trending News