AP CM YS Jaganmohan Reddy Helps Kidney Patient: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. బుధవారం కాకినాడ జిల్లా జగ్గంపేట పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఝాన్సీ రాణి అనే యువతి కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. తాను కిడ్నీ వ్యాధి సమస్యతో బాధ పడుతున్నానని, వ్యాధికి అవసరమైన చికిత్స కోసం ఎంతో ఖర్చయిందని.. ఆర్థికంగా ఎంతో చితికిపోయిన తనకు ఏదైనా ఉపాధి మార్గం చూపించాల్సిందిగా ఆ అనారోగ్య బాధితురాలు సీఎం వైఎస్ జగన్ కి విజ్ఞప్తి చేసుకున్నారు. ఝాన్సీ రాణి ఆవేదన విని చలించిపోయిన సీఎం వైఎస్ జగన్.. నువ్వు అధైర్య పడొద్దని, ప్రభుత్వం తరపున తాము ఆదుకుంటామని హామీ ఇచ్చిన ధైర్యం చెప్పారు.
బాధితురాలి నుండి వినతిపత్రం తీసుకుని అందులో ఉన్న వివరాలు పరిశీలించిన సీఎం వైఎస్ జగన్.. ఆమెకు ప్రభుత్వం తరుపున తగిన సహాయం చేస్తూ అండగా నిలవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మిగతాది తాను చూసుకుంటాను అని బాధితురాలికి భరోసా ఇచ్చి అక్కడి నుండి ముందుకు కదిలారు. ఆ సమయంలో ఆ జిల్లా కలెక్టర్ డా క్రితికా శుక్లా అక్కడే ఉన్నారు. అనంతరం సీఎం జగన్ జగ్గంపేటలో తన పర్యటన కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
ఇక్కడ సీన్ కట్ చేస్తే.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అర్జీ ఇచ్చిన 3 గంటల్లోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఝాన్సీ రాణికి ఆమె అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ డా క్రితికా శుక్లా ఆమెకి నియామక పత్రాన్ని అందించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఝాన్సీ రాణికి ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సకు ఏర్పాట్లు సైతం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ జగ్గంపేట పర్యటనలో సీఎంను కలిసిన అనారోగ్య బాధితురాలు ఝాన్సీ రాణి. కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నానని, ఏదైనా ఉపాధి మార్గం చూపమని విజ్ఞప్తి. అధైర్య పడొద్దని, ఆదుకుంటానని హామీ ఇచ్చిన సీఎం. pic.twitter.com/OGW0Sz3Nnt
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 30, 2023
దీంతో సీఎం జగన్ హామీ ఇచ్చిన తరువాత కేవలం 3 గంటల వ్యవధిలోనే ఆమెకు ఉపాధి మార్గంగా ఉద్యోగ అవకాశం ఇవ్వడంతో పాటు ఆమె అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకుని చికిత్సకు సైతం ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏపీ సీఎంఓ తమ అధికారిక ఎక్స్ ( గతంలో ట్విటర్ ) హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. బాధితురాలు ఝాన్సీ రాణి సీఎం జగన్‌ని కలిసి తన గోడు మొరపెట్టుకోవడం, బాధితురాలికి సీఎం జగన్ ధైర్యం చెప్పడం వంటి దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.