మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రసంగం

29సార్లు ఢిల్లీకి వెళ్లినా.. కనీస కనికరం లేకుండా కేంద్రం ఎప్పటికప్పుడు ఏపీకి అన్యాయమే చేస్తూ వస్తోంది- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Last Updated : Mar 8, 2018, 01:11 PM IST
 మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ శాసనసభలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాను రాష్ట్ర విభజన జట్టంలో వున్న అంశాలు తప్ప అంతకు మించి ఇంకేమీ అడగడం లేదు అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. నాలుగు సంవత్సరాలపాటు ఓపిక పట్టాను. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా కనీస కనికరం లేకుండా ఎప్పటికప్పుడు కేంద్రం ఏపీకి అన్యాయమే చేస్తూ వస్తోంది. కేవలం  ఫెడరల్ స్పూర్తితో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఓపిక పడుతున్నాను. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలనే భావిస్తున్నాను. అందువల్లే ఓపిక పడుతున్నాను అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

సీఎం చంద్రబాబు ప్రసంగంలో పలు ముఖ్యాంశాలు:
> దుగరాజుపట్నం పోర్టు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన హామీన కనుక కేంద్రమే దుగరాజుపట్నం పోర్టుని త్వరితగతిన పూర్తి చేయాలి.
> ఎమ్మెల్యే సీట్ల పెంపు కోసం పైసా ఖర్చు లేదు. అయినా ఆ సీట్ల పెంపుని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసెంబ్లీ స్థానాల పెంపు కేవలం చంద్రబాబుకే అవసరం అన్నచందంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే నేనూ అడగడం మానేశాను.
> పెద్దన్న పాత్రలో వున్న కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రా అభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అవసరం వుంది.
> కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న అనేక సంస్థల కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించినప్పటికీ.. సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. ముందుకొచ్చిన చోట నిధులు కేటాయించడం లేదు.
> వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రమే అధిక మొత్తంలో ప్యాకేజీ ఇవ్వాలి. బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రం ఏపీకి ఎందుకు ఇవ్వలేకపోతోంది ? అని ప్రశ్నించారు చంద్రబాబు.
> లోపభూయిష్టమైన చట్టాల వల్ల కృష్ణపట్నం పోర్టు వ్యవహారంలో పన్ను రూపంలో ఏపీ ప్రభుత్వం భారీగా నష్టపోతోంది. 
> షెడ్యూల్ 9, 10లోని అంశాలను కేంద్రం సత్వరమే అమలు చేయాలి.
> నేను ఫెడరల్ స్పూర్తితో ముందుకెళ్తున్నాను. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలనే భావిస్తున్నాను.
> స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పార్టీ పెట్టారు అని ఇటీవలే పార్లమెంట్‌లో గొప్పగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడిలా మళ్లీ తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆడుకోవడం సబబు కాదు.   
> ఈ దేశంలో ప్రజా సేవలో అధిక కాలం గడిపిన మొదటి సీనియర్ నాయకుడు ఎవరైనా వున్నారా అంటే, అది తానే అని భావిస్తాను. అది నాకు తెలుగువారు ఇచ్చిన గౌరవం, అవకాశం.
> తాను కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించిన సందర్భాలున్నాయి.
> తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పటి అధికారపక్షం తనపై కేసులు పెట్టడానికి చేయని ప్రయత్నాలు లేవు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు.
> విద్యార్థి జీవితం నుంచి ఇప్పటివరకు తనపై ఏ ఒక్క కేసు లేదు. తన రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదు. ఎక్కడా తప్పు చేయను. నిప్పులాంటోడిని. ఎంతో కృతనిశ్చయంతో, గుండె నిబ్బరంతో వుంటాను. అందుకే అన్నీ మర్చిపోయి రోజూ ఆరు గంటలపాటు మంచిగా నిద్రపోతాను. 

Trending News