పెళ్లికి వెళ్తాం.. అసెంబ్లీకి సెలవిస్తే..?

నవంబరు 23,24 తేదీలకు గాను దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు సెలవుల కోసం దరఖాస్తులు అందించారు. ఆ రెండు రోజులలో పలువురి ప్రముఖుల వివాహాలకు హాజరవ్వాల్సి ఉన్నందున ఎమ్మెల్యేలు సెలవులు కావాలని స్పీకరుకి వినతి పత్రాన్ని అందించారు

Last Updated : Nov 24, 2017, 06:27 PM IST
    • ప్రస్తుత శాసనసభ్యుల నెలవారీ వేతనం 1.25 లక్షలు
    • అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజుల్లో ఎమ్మెల్యేలు సెలవులు పెట్టడంపై ప్రతిపక్షం విమర్శలు
    • పెళ్లిళ్లకు హాజరవ్వడం కోసం 100 మంది ఎమ్మెల్యేలు సెలవుకు దరఖాస్తు
పెళ్లికి వెళ్తాం.. అసెంబ్లీకి సెలవిస్తే..?

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సభ సమావేశాలు ఎడతెరిపి లేకుండా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇటీవలే ఓ రెండు రోజులు సెలవు ప్రకటించారు. అయితే ఆ సెలవులు ఎందుకు ప్రకటించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నవంబరు 23,24 తేదీలకు గాను దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు సెలవులకు దరఖాస్తులు పెట్టడమే అందుకు కారణం. ఆ రెండు రోజులలో పలువురి ప్రముఖుల పెళ్లిళ్ళకు హాజరవ్వాల్సి ఉన్నందున ఎమ్మెల్యేలు సెలవులు కావాలని స్పీకరుకి వినతి పత్రాన్ని అందించారు. ముహుర్తబలం వల్ల ఈ రెండు రోజులలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 లక్ష 20 వేలకు పైగా వివాహాలు జరగనున్నాయని అంచనా. సెలవులు కావాలన్న శాసనసభ్యుల అభ్యర్థన మేరకు స్పీకరు కోడెల శివప్రసాదరావు ప్రకటన జారీ చేశారు. నవంబరు 23, 24 తేదీలకు గాను సెలవులు ప్రకటిస్తున్నామని... తిరిగి శాసనసభ నవంబరు 28వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు. 

అయితే పెళ్లిళ్లకు హాజరవ్వడం కోసం బాధ్యతయుతమైన పదవులలో ఉన్న ఎమ్మెల్యేలు సెలవులు కావాలని అడగడమేమిటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే శాసనసభ్యుల జీతభత్యాలు కూడా భారీగా పెరిగాయి. 95000 రూపాయల నుండి 1.25 లక్షలకు జీతాన్ని పెంచారు. అలాగే ఇంటి అద్దెకు గాను నెలకు 25000 చెల్లిస్తోంది ప్రభుత్వం. అలాగే రిటైర్డు శాసనసభ్యులకు 50000 రూపాయలు పెన్షన్‌ కూడా ఇస్తోంది. అదేవిధంగా పుస్తకాలు, పత్రికలు కొనడానికి వార్షిక బిల్లును 20,000 రూపాయలకు పెంచారు. అలాగే క్వార్టర్స్‌లో కాకుండా బయట ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకొనే ఎమ్మెల్యేలు ఇంటి అడ్వన్సు ఇవ్వాలని భావిస్తే.. రికవరబుల్ సొమ్ము క్రింద 20 లక్షలు కూడా అందజేస్తోంది ప్రభుత్వం. ఇన్ని సౌకర్యాలు పొందుతూ కూడా.. అసెంబ్లీ సమావేశాలప్పుడు సెలవులు కావాలని ప్రజా ప్రతినిధులు కోరడం ఎంత వరకు  సబబు అని పలువురు విమర్శిస్తున్నారు. 

 

Trending News