భగత్ సింగ్ డాక్యుమెంట్లను బహిర్గతం చేసిన పాక్

స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ కేసుల విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లను పాకిస్థాన్ ప్రభుత్వం బహిర్గతం చేసింది.

Last Updated : Mar 27, 2018, 02:00 PM IST
భగత్ సింగ్ డాక్యుమెంట్లను బహిర్గతం చేసిన పాక్

లాహోర్: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ కేసుల విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లను పాకిస్థాన్ ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఉరిశిక్ష విధించిన 87 ఏళ్ల అనంతరం పాకిస్థాన్ తొలిసారిగా ప్రదర్శనకు ఉంచింది. సోమవారం లాహోర్‌లోని అనార్కలీ స్మారక కేంద్రం వద్ద ఉన్న పంజాబ్ రాష్ట్ర ఆర్కీవ్స్ విభాగంలో డాక్యుమెంట్లను ప్రదర్శనకు ఉంచారు.

వీటిలో భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వు కాపీ, పుస్తకాలు, వార్తాపత్రికల కోసం భగత్ పెట్టుకున్న దరఖాస్తులు, కుమారుడిని ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుతూ భగత్‌సింగ్ తండ్రి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, ఆర్జీలు, ఉరిశిక్షను అమలు చేసినట్లు లాహోర్ జైలు సూపరింటెండెంట్ సంతకంతో కూడిన పత్రం, జైలు నుంచి భగత్‌సింగ్ తన తండ్రికి రాసిన లేఖలు, కళాశాలలో భగత్‌సింగ్ అడ్మిషన్ పొందిన రికార్డులు, భగత్ సింగ్ నివసించిన ప్రాంతాలు, చదివిన పుస్తకాలు మొదలైనవి ప్రదర్శనకు ఉంచారు.

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ సయీద్ సమక్షంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. భగత్‌సింగ్ భారత్, పాక్ దేశాలకు చెందిన హీరో. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాలపై ఇరుదేశాల ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ప్రదర్శనకు ఉంచామని అధికారులు తెలిపారు.

Trending News