ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష చేసేందుకు సిద్ధంగా ఉందని.. అందుకు అనువైన రోజు కోసం ఎదురు చూస్తోందని అమెరికా ఇంటెలిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 10న ఉత్తర కొరియాలో జరగబోయే వర్కర్స్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని.. బలప్రదర్శనకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అమెరికాలోని పలు సీక్రెట్ ఏజెన్సీలు అప్రమత్తమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా అక్టోబర్ 9న అమెరికాలో ‘కొలంబస్ డే’ కావున, సాధారణంగా సెలవుదినంగా ప్రకటిస్తారు. అయినప్పటికీ ఆ రోజు భద్రతా దళాలు మాత్రం క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి ఉంటుందని, సరిహద్దుల్లో పహారాను పటిష్టం చేయాల్సిందేనని ట్రంప్ సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉత్తర కొరియా కనీసం 14 సార్లు క్షిపణి పరీక్షలు నిర్వహించింది. పైగా అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తామని ఎప్పటికప్పుడు ప్రకటించడం.. హైడ్రోజన్ బాంబు కూడా తమ వద్ద ఉందని బహిరంగ ప్రకటనలు చేయడం మిగతా దేశాలను కూడా కలవరానికి గురి చేస్తున్నాయి.