Israel Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని, దేశవ్యాప్తంగా వైమానిక దాడుల సైరన్‌లు మోగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. నివాసితులు సురక్షిత ప్రదేశాలలో, బాంబు షెల్టర్ల దగ్గర ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అదే సమయంలో, మంగళవారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరించింది. దాడికి టెహ్రాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది. ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్‌లో భూదాడి ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెప్పడంతో ఈ హెచ్చరికలు వచ్చాయి.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా సైనిక దాడి చేస్తే ఇరాన్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధికారి తెలిపారు. కాగా, నస్రల్లా హత్య ఇజ్రాయెల్ నాశనానికి దారితీస్తుందని ఇరాన్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి టెహ్రాన్ దళాలను మోహరించదని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడి వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ కు తాము అండగా నిల్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టెల్ అవీవ్, జెరూసలెం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇరాన్ దీటుగా ఇజ్రాయెల్ సాంకేతిక వ్యవస్థ క్షిపణులను పేల్చివేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.