'ట్రంప్‌తో భేటీ కోసం కిమ్‌ ప్రాధేయపడ్డాడు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ నెల 12న సింగపూర్‌ భేటీ కానున్నారు.

Last Updated : Jun 7, 2018, 12:21 PM IST
'ట్రంప్‌తో భేటీ కోసం కిమ్‌ ప్రాధేయపడ్డాడు'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ నెల 12న సింగపూర్‌ భేటీ కానున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయ సలహాదారు (అటార్నీ) కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడితో సమావేశం కోసం చేతులు జోడించి మరీ మోకరిల్లారని అటార్నీ అన్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. కచ్చితంగా తమ భేటీ జరగాలని కిమ్ ‌.. ట్రంప్‌ను బతిమాలారట. ఈ విషయాన్ని  ట్రంప్‌ లాయర్‌ రుడీ గిలియానీ వెల్లడించారు.

ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ‘ భేటీ రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్‌ కిమ్‌కు లేఖ పంపితే.. కిమ్‌ భేటీ జరగాలని ట్రంప్‌ను ప్రాధేయపడ్డారు. జూన్‌ 12న సింగపూర్‌లో ఎలాగైనా సమావేశం జరగాలని కిమ్‌ అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖలో చేతులు జోడించి మరీ మోకరిల్లారు. నిర్ణయంపై పునరాలోచించాలని కిమ్‌ అడుక్కున్నారు (బెగ్గింగ్‌). దీంతో ట్రంప్‌ తన మనసు మార్చుకున్నారు’ అని ట్రంప్‌ లాయర్‌ వివరించారు.

భేటీపై శ్వేతసౌధం తొలిసారిగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సింగపూర్ రిసార్ట్ ద్వీపమైన సెంటోసాలో విలాసవంతమైన హోటల్లో యూఎస్  మరియు ఉత్తర కొరియా నేతల మధ్య జూన్ 12 చారిత్రాత్మక భేటీ జరుగుతుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలియజేశారు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చడమే ప్రధాన అజెండాగా ట్రంప్ చర్చించనున్నారని తెలిసింది.

Trending News