అమెరికాలో శరత్‌ను కాల్చిచంపిన అనుమానితుడి ఫుటేజ్‌ రిలీజ్‌

అమెరికాలో తెలంగాణ విద్యార్థి శరత్‌ను కాల్చిచంపిన అనుమానితుడి సీసీ ఫుటేజ్‌ను కేన్సాస్ పోలీసులు విడుదల చేశారు.

Last Updated : Jul 8, 2018, 02:03 PM IST
అమెరికాలో శరత్‌ను కాల్చిచంపిన అనుమానితుడి ఫుటేజ్‌ రిలీజ్‌

అమెరికాలో తెలంగాణ విద్యార్థి శరత్‌ను కాల్చిచంపిన అనుమానితుడి సీసీ ఫుటేజ్‌ను కేన్సస్ పోలీసులు విడుదల చేశారు. కేన్సస్‌లో శనివారం దుండగుడి కాల్పుల్లో వరంగల్‌వాసి శరత్‌ కొప్పుల(26) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేన్సస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియోలో పోలీసులు ఓ అనుమానితుడిని గుర్తించి సీసీ ఫుటేజ్‌ను రిలీజ్‌ చేశారు. అందులో దుండగుడు అటూ, ఇటూ తిరగడం కనిపించింది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకి తెలిపినవారికి 10వేల డాలర్ల బహుమతి ప్రకటించారు పోలీసులు.

అయితే రెస్టారెంట్‌ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు శరత్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడికి దొంగతనం చేయడానికే వచ్చాడని, అడ్డుకోబోయిన శరత్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. తుపాకీ చూపిన వెంటనే దుండగుడి నుంచి తప్పించుకోబోతుండగా అతడు కాల్పులు జరపడంతో శరత్‌ వెనకపైపు బుల్లెట్లు తగిలాయని.. వెంటనే అక్కడే కుప్పకూలిపోయాడని తెలిపారు.

శరత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్

అమెరికాలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన శరత్ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అమీర్‌పేట్‌లో నివాసముంటున్న శరత్ కుటుంబ సభ్యులను మంత్రులు కడియం, తలసానిలతో కలిసి పరామర్శించిన ఆయన.. శరత్‌ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాలనుకుంటే ప్రభుత్వ ఖర్చులతో పంపిస్తామని.. శరత్ మృతిపై రాయబార కార్యాలయ సిబ్బందితో మాట్లాడామని కేటీఆర్ చెప్పారు.

Trending News