ఖగోళ రహస్యాలు, వింతలపై ఆసక్తి చూపే వారికి ఇది శుభవార్త. జులై 27న ఆకాశంలో అరుదైన 'అరుణ వర్ణ చందమామ(బ్లడ్ మూన్)' కనువిందు చేయనుంది. ఈ రోజు ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం (103 నిమిషాలు) చరిత్రలో నిలిచిపోనుంది. భూ వాతావరణం ప్రభావంతో వక్రీభవనం చెందిన సూర్యకాంతి ప్రకాశింపచేయడంతో సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలో కనిపించనున్నాడు. కాగా ఈ ఏడాది జనవరి 31న కూడా చంద్రుడు 'సూపర్ బ్లూ బ్లడ్ మూన్'గా కనిపించిన సంగతి తెలిసిందే!
జులై 27 రాత్రి 10.40 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం జులై 28 న తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగుతుంది. జులై 27 రాత్రి 10.40 గంటలకు ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం జులై 28 న తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కనుమరుగు కావడానికి బదులు, భూ వాతావరణంపై ప్రసరించే సూర్యకాంతి వల్ల ఎరుపు రంగును సంతరించుకుంటాడు.
బ్లడ్ మూన్ ప్రపంచంలోని తూర్పు అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుంది - యూరోప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. ఆసియా, ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా ప్రజలు ఉదయం వేళలో, ఐరోపా మరియు ఆఫ్రికా ప్రజలు సాయంత్రం వేళలో గ్రహణ దృశ్యాన్ని వీక్షించవచ్చు.
అలాగే ఇదే సమయంలో 15 ఏళ్ల తర్వాత మరోసారి అంగారక గ్రహం భూమికి అత్యంత సమీపంగా రానున్నది. సూర్యుడికి ఎదురుగా వచ్చి మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని నాసా వెల్లడించింది. 60 వేల ఏళ్ల తరువాత 2003లో భూమికి అత్యంత దగ్గరగా మార్స్ వచ్చినట్లు నాసా తెలిపింది. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా అంగారకుని చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత వర్షాకాలం కావడంతో ఆకాశం నిర్మలంగా ఉంటే అంగారకుని చూడవచ్చు.
చంద్ర గ్రహణం అంటే ఏమిటి?
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్రగ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.
భూమి యొక్క నీడను ఛాయ మరియు ప్రచ్ఛాయ అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఛాయ అనగా సూర్యకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగము. దీనివలన సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ప్రచ్ఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డగించబడిన ప్రాంతం. దీనివలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని 'పాక్షిక చంద్రగ్రహణం' అని, పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని 'సంపూర్ణ చంద్రగ్రహణం' అని అంటారు. ఈ సందర్భంగా చంద్రుడిపై పడే కిరణాలు భిన్న రంగుల్లో మారి ఎరుపు, నీలం రంగులో దర్శనమిస్తాయి.