కేరళ వరద బాధితులకు రూ.25 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్లు తెలంగాణ సర్కారు తెలిపింది. ఈ విరాళాన్ని తానే స్వయంగా వ్యక్తిగతంగా చెక్ ద్వారా కేరళ సీఎం సహాయనిధికి పంపిస్తానని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తెలిపారు. ఈ మొత్తంతో పాటు తన ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా అందజేస్తున్నట్లు కేటీఆర్ తెలియజేశారు. అలాగే తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చేతనైనంత సహాయాన్ని చేసి.. కేరళ వరద బాధితులకు విరాళాలు పంపాలని కేటీఆర్ కోరారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. కేటీఆర్ ప్రకటనకు ముందే తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలతోపాటు ఇతర రంగాలకు చెందిన వారు సైతం ఇతోధిక సాయం అందించడానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఘోర విపత్తు నుంచి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సైతం తమవంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేరళకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.
వరదల కారణంగా తాగు నీటి సరఫరా పూర్తిగా దెబ్బతిన్నందున వరద బాధితుల నీటి కష్టాలు తీర్చేలా నీటిని శుద్ధి చేసే రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషిన్లను కేరళకు పంపించాల్సిందిగా సంబంధిత అధికార యంత్రాంగానికి తెలంగాణ సీఎం సూచించారు. ఇదేకాకుండా 100 మెట్రిక్ టన్నుల బాలామృతంను కేరళ పంపించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ సరుకును బేగంపేట విమానాశ్రయం నుంచి రక్షణశాఖకు చెందిన ప్రత్యేక విమానంలో కేరళ తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Besides the Telangana state Govt contribution of 25Cr to Kerala, I personally pledge my 1 month salary to flood relief. Will be sending the cheque to CMRF
Request my colleague legislators to also contribute as much as possible#TelanganaStandsWithKerala
— KTR (@KTRTRS) August 18, 2018